There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
పరిచయం:
ప్రముఖ చరిత్రకారుడు మార్టిమర్ వీలర్ చెప్పినట్లుగా, “మోహెంజొ-దారో అనేది పట్టణ ప్రణాళికలో ఒక అద్భుతం". హరప్పా నాగరికతను (సుమారు క్రీ.పూ. 2600–1900) ప్రాచీన కాలంలోనే రూపు దిద్దుకున్న అసాధారణ పట్టణ ప్రణాళిక, పౌర మేధోసంపత్తి మరియు భూగర్భ నీటి పారుదల వ్యవస్థలకు ఉదాహరణగా చెప్పవచ్చు.
విషయం:
సింధు నాగరికత పట్టణ ప్రణాళిక - ప్రధాన లక్షణాలు
1. గ్రిడ్ ఆధారిత పట్టణ ప్రణాళిక
మోహెంజొ-దారో మరియు కాలీబంగన్ వంటి నగరాలు గ్రిడ్ నమూనాలో నిర్మించబడ్డాయి — ప్రధాన వీధులు సుమారు 90 డిగ్రీల కోణంతో కలిసేలా నిర్మాణాన్ని చేపట్టారు. ఇది ప్రణాళికా బద్దమైన నగర నిర్మాణ శైలికి తార్కాణం గా చెప్పవచ్చు.
2. కోట ప్రదేశం మరియు దిగువ పట్టణ విభజన
మొహంజొదారో, హరప్పా నగరాలు రెండు ప్రధాన భాగాలుగా విభజన చెంది ఉండేవి. మెరక ప్రాంతంలో కోట, పల్లపు/దిగువ పట్టణ ప్రాంతంలో పౌర నివాసాలు ఉండేవి. సామాజిక స్థలాలు మరియు వాటి వినిమయానికి అనుగుణంగా పట్టణ నిర్మాణాన్ని చేపట్టిన తొలి ప్రజలుగా హరప్పన్లను చెప్పవచ్చు.
3. భూగర్భ మురికి నీటి పారుదల వ్యవస్థ
నగరాల్లో ఇళ్ల నిర్మాణంతో పాటు ప్రత్యేక శ్రద్ధతో నిర్మించిన మురుగునీటి కాల్వలు ఉన్నాయి. రహదారుల పక్కన మురుగు కాల్వలను నిర్మించారు. భూగర్భంలో ఇటుకలతో కట్టిన మురుగు నీటి కాలువను శుభ్రం చేయడానికి అక్కడక్కడా మనిషి దూరేందుకు రంధ్రాలున్నాయి. ఈ అంశాలు పరిశుభ్రతకు హరప్పా ప్రజలు ఇచ్చిన ప్రాముఖ్యతను మరియు వారి అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని సూచిస్తాయి.
4. ప్రామాణికమైన నిర్మాణ సామాగ్రి
ఇంచుమించుగా ఒకే పరిమాణంలో ఉండే కాల్చిన ఇటుకలు, తూనిక రాళ్లను వాడకం వలన హరప్పా నగరాల మధ్య సమన్వయం సుష్పష్టం గా తెలుస్తుంది.
5. ప్రజా భవనాలు మరియు నిర్మాణాలు
ప్రభుత్వ కార్యాలయాలు, ధాన్యపు గిడ్డంగులు, ముఖ్య కర్మాగారాలు, ప్రార్ధనా మందిరాలు, 'మహా స్నానవాటిక' వంటి నిర్మాణాలు ఆర్థిక నియంత్రణ, పౌర జీవితానికి హరప్పన్లు ఇచ్చిన ప్రాముఖ్యతకు అద్దం పడతాయి.
హరప్పా పట్టణ ప్రణాళికపై విమర్శనాత్మక విశ్లేషణ :
1. అన్ని నగరాలు గ్రిడ్ నమూనాతో నిర్మాణం కాకపోవడం -
గెగ్రోరీ పోసెల్ మరియు ఉపిందర్ సింగ్ వంటి చరిత్రకారులు ప్రతీ నగరం గ్రిడ్ నమూనాలోనే ఉండేదన్న వాదన సరికాదు అని అభిప్రాయపడ్డారు. మొహంజొదారో మరియు హరప్పా వంటి ప్రధాన నగరాలు మినహా మిగిలిన నగరాలు గ్రిడ్ నమూనాలో నిర్మాణం కాలేదు అని వీరి అభిప్రాయం.
2. రాజకీయ అధికారంపై స్పష్టత లేకపోవడం -
సింధు నగరాలు రెండుగా విభజింబడినప్పటికీ రాజప్రాసాదాలు, దేవాలయాలు మొదలైన రాజకీయ కట్టడాలు లేకపోవడం వల్ల బలమైన కేంద్రీకృత పాలన ఉండేదన్న భావన సరికాదు అని అర్థం చేసుకోవచ్చు.
3. సమానత్వం లేకపోవడం -
నగర సదుపాయాలు వర్గాల ఆధారంగా అందించబడ్డాయి. ఉదా: ప్రతీ ఇంటికీ ప్రధాన మురుగునాళాలు అనుసంధానించబడలేదు. కోట ప్రదేశం లో రెండు అంతస్థుల భవనాలు కనిపిస్తే దిగువ పట్టణ ప్రదేశంలోని సామాన్యుల ఇల్లు ఒకే గదితో నిర్మాణం కాబడ్డాయి.
4. ప్రజా భవనాల పని తీరు విషయంలో స్పష్టత లేదు -
హరప్పా లిపిని ఇంకా ఎవరూ అర్థం చేసుకోలేదు కాబట్టి మహాస్నానవాటిక లేదా ధాన్యాగారాలు వంటి నిర్మాణాల వెనుక ఉన్న ఉద్దేశ్యం మరియు వాటి పనితీరు గురించి స్పష్టంగా తెలియదు. వాటిని ఆచారపరంగా వాడారా లేక ప్రజా అవసరాల కోసం వాడారా అనేది అనుమానాస్పదమే.
5 మెరుగైన, వైభవోపేతమైన నిర్మాణాలు హరప్పా నాగరికతలో కనిపించకపోవడం -
మెసపొటేమియా లేదా ఈజిప్ట్ వంటి నాగరికతలతో పోలిస్తే హరప్పా ప్రజలు అద్భుతమైన స్మారక నిర్మాణాలు నిర్మించలేదు. ఇది వాళ్ల సంస్కృతిలో భాగం కావచ్చు లేదా ఇంకా తవ్వకాలు పూర్తికాకపోవడం వల్ల కావచ్చు.
ముగింపు:
హరప్పా నాగరికతలో కనిపించిన ప్రత్యేక పట్టణ ప్రణాళికా శైలి మరియు దాని ప్రాముఖ్యత నేటికీ తన ప్రభావాన్ని చూపుతోంది. చండీగఢ్ నగరపు గ్రిడ్ నమూనా నుంచి హైదరాబాద్ 4.0 లాంటి స్మార్ట్ సిటీల వరకూ, ప్రాచీన భారతీయ విజ్ఞానం మరియు ఇంజనీరింగ్ నైపుణ్యం ఇప్పటికీ ఆధునిక పట్టణాల అభివృద్ధికి ప్రేరణ ఇస్తోంది.