There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Sun Apr 20, 2025
పరిచయం:
భారత జాతీయ ఉద్యమం తొలుత విదేశీ పాలనను తుదముట్టించేందుకు సాగిన పోరాటంగా ప్రారంభమై, కాలక్రమేణా సామాజిక మరియు ఆర్థిక న్యాయాన్ని సాధించాలన్న లక్ష్యంతో కొనసాగింది. ఆంగ్లేయులు భారతదేశ వనరులను దోచుకోవడమే కాకుండా, దేశ ప్రజల మధ్య ఆంతర్యాలను కూడా సృష్టించడంతో, వర్గవివక్ష నిర్మూలన, మరియు సామాజిక న్యాయంపై దృష్టి సారించిన సోషలిస్ట్ భావజాలం జాతీయోద్యమ లక్ష్యాలతో పాటుగా, రాజకీయ వ్యూహాలను కూడా ప్రభావితం చేయడం ప్రారంభించింది.
విషయం:
సోషలిస్ట్ భావజాలం యొక్క ఆవిర్భావం మరియు ప్రారంభ ప్రభావం (1900లు–1930లు)
1. బ్రిటిష్ ఆర్థిక విధానాలపై విమర్శలు
a) దాదాభాయ్ నౌరోజీ వంటి తొలినాటి జాతీయవాదులు భారతదేశ ఆర్థిక క్షీణతకు కారణమైన బ్రిటిష్ విధానాలను విమర్శించారు. తన గ్రంథం పావర్టీ అండ్ అన్-బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియాలో, భారతదేశ వనరులు ఎలా దోపిడీ కి గురి అవుతున్నాయో ఆయన వివరించారు. ఈ వాదన తరువాతి సామ్యవాద ఆలోచనలకు ప్రేరణగా నిలిచింది.
2. అంతర్జాతీయ సోషలిస్ట్ ఉద్యమాల ప్రభావం
a) 1917లో జరిగిన రష్యన్ విప్లవం భారత రాజకీయ సిద్ధాంతాలు మరియు వ్యూహాలపై గణనీయమైన ప్రభావం చూపింది. ఎం.ఎన్. రాయ్ వంటి భారత విప్లవకారులు దీని నుండి స్ఫూర్తి పొంది, కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ (కామిన్‌టర్న్) స్థాపక సభ్యులలో ఒకరిగా మారి, సోషలిస్ట్ భావాలను వ్యాప్తి చేయడంలో తోడ్పడ్డారు.
3. భారతదేశంలో విప్లవాత్మక సామ్యవాదం
a) భగత్ సింగ్ మరియు అతని సంస్థ హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్‌ఎస్‌ఆర్‌ఏ), నిజమైన విప్లవం యొక్క లక్ష్యం అన్ని రకాల దోపిడీలను (వ్యక్తుల మధ్య మరియు జాతుల మధ్య) అంతం చేయడమనే భావనను ప్రచారం చేశారు. అతని వై ఐ యామ్ యాన్ ఎథీస్ట్ వంటి రచనలు దేశభక్తి భావనలను మార్క్సిస్ట్ సూత్రాలతో అనుసంధానిస్తూ భారత యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి.
4. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపన (1925)
a) కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) 1925లో కాన్పూర్‌లో స్థాపించబడింది. ఇది కార్మికులు మరియు రైతులను ఒక తాటిన కట్టడానికి కీలక వేదికగా మారింది. సీపీఐ పెషావర్ కుట్ర కేసు వంటి సంఘటనల్లో పాల్గొని, తరువాత అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) ద్వారా కార్మిక హక్కులకై ఎంతగానో కృషి చేసింది.
5. కార్మికులు మరియు రైతుల భాగస్వామ్యం
a) సామ్యవాద భావాలు కార్మిక సంఘాలు మరియు రైతు ఉద్యమాల ద్వారా గ్రామీణ స్థాయికి చేరాయి.
b) ఉదాహరణ: సహజానంద సరస్వతి అఖిల భారత కిసాన్ సభను నడిపించి, రైతుల కోసం న్యాయ బద్ధమైన కౌలుదారుల భద్రత వంటి హక్కులను డిమాండ్ చేశారు.
జాతీయ ఉద్యమంలో సామ్యవాద భావజాల ప్రభావం (1930లు–1947)
1. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపన (1934)
a) జయప్రకాశ్ నారాయణ్, ఆచార్య నరేంద్ర దేవ్, మరియు రామ్ మనోహర్ లోహియా భారత జాతీయ కాంగ్రెస్‌ను ఆర్థిక సమానత్వ సాధన మరియు స్వాతంత్య్ర సమరంలో సామాన్యుల విస్తృత భాగస్వామ్యం వైపు నడిపించడానికి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ (సీఎస్‌పీ)ని స్థాపించారు.
2. జవహర్‌లాల్ నెహ్రూ యొక్క ప్రజాస్వామ్య సామ్యవాదం
a) జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్య సామాజిక సంస్కరణలకు ప్రాముఖ్యతనిచ్చే ఫాబియన్ సోషలిజం ద్వారా చాలా ప్రభావితమయ్యారు. 1936లో కాంగ్రెస్ లక్నో సమావేశంలో తన అధ్యక్ష ఉపన్యాసంలో, సామ్యవాదమే ప్రపంచంలోని ప్రధాన సమస్యలకు ఏకైక పరిష్కారమని పేర్కొన్నారు. ఆయన ఆర్థిక స్వావలంబన మరియు సామాజిక న్యాయ సాధనకై ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను సమర్థించారు.
3. కరాచీ తీర్మానం (1931)
a) సోషలిస్ట్ ఆలోచనల ప్రభావంతో, భారత జాతీయ కాంగ్రెస్ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ఇందులో పౌర స్వేచ్ఛ, న్యాయమైన వేతనాలు, ఉచిత విద్య, మరియు కార్మిక హక్కుల రక్షణ వంటి వాగ్దానాలు ఉన్నాయి. ఇది జాతీయ ఉద్యమంలో ఆర్థిక మరియు సామాజిక హక్కులకు సంబంధించిన తొలి ప్రధాన తీర్మానంగా నిలిచింది.
4. సామూహిక ఉద్యమాల్లో పాత్ర
a) సోషలిస్ట్ నాయకులు 1942లో క్విట్ ఇండియా ఉద్యమం వంటి ప్రధాన ఉద్యమాలలో రైతులు, కార్మికులు మరియు యువత విస్తృతంగా పాల్గొనేందుకు ఎంతగానో కృషి చేసారు.
b) ఉదాహరణ: రామ్ మనోహర్ లోహియా సామాన్య ప్రజానీకాన్ని జాతీయోద్యమంలో భాగం చేయడంలో కీలకమైన పాత్ర పోషించడమే గాక, న్యాయం మరియు సమానత్వ పునాదులపై నిర్మితమయ్యే సంపూర్ణ స్వాతంత్య్ర భావనను ప్రచారం చేశారు. 5. స్వాతంత్ర్యానంతర ప్రణాళికలపై ప్రభావం
a) స్వతంత్ర భారతదేశ ఆర్థిక అభివృద్ధి ప్రణాళికలు చాలా వరకు సోషలిస్ట్ భావాల ద్వారా రూపొందించబడ్డాయి.
b) ఉదాహరణ: 1944లో పారిశ్రామికవేత్తలు ప్రతిపాదించిన బొంబాయి ప్లాన్ మరియు నెహ్రూ నేతృత్వంలోని జాతీయ ప్రణాళికా కమిటీ రెండూ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని సమర్థించాయి. ఈ ప్రయత్నాలు తరువాత సోవియట్ యూనియన్ విధానం మాదిరిగా పంచ వర్ష ప్రణాళికల అమలుకు దోహదపడ్డాయి.
ముగింపు
సామ్యవాద భావజాలం సమానత్వం మరియు సామాజిక సంక్షేమ సూత్రాలను పరిచయం చేయడం ద్వారా భారత స్వాతంత్య్ర ఉద్యమానికి బలమైన లక్ష్యాలను జోడించింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చెప్పినట్లుగా — "సామాజిక ప్రజాస్వామ్యం పునాదిగా లేనిదే, రాజకీయ ప్రజాస్వామ్యం నిలదొక్కుకోలేదు.” ఈ మాటలు స్వాతంత్య్ర అనంతర భారతదేశానికి దిశానిర్దేశంగా మారాయి.
Additional Embellishment: