TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES

Sun Apr 20, 2025

Q. దేశ విభజనలో మతతత్వవాద పాత్రను విశ్లేషించండి.

పరిచయం:
భారత స్వాతంత్ర్య పోరాటంలో జాతీయవాదంతో పాటు దీర్ఘకాలంలో బలపడిన మతతత్వం యొక్క ఫలితమే ౧౯౪౭ దేశ విభజన. బ్రిటీషు వారి విభజించి-పాలించు సిద్ధాంతానికి అనుగుణంగా ఆవిర్భవించిన మతతత్వ సంస్థలు క్రమంగా రాజకీయంగా బలపడటమే కాక తర్వాత వచ్చిన ద్విజాతి సిద్ధాంతం కూడా దేశ విభజనకు కారణమయింది.

విషయం:
భారత జాతీయ ఉద్యమంలో మతతత్వం యొక్క పరిణామక్రమం

1. బ్రిటిష్ వారి "విభజించి పాలించు" విధానం
a) బ్రిటిష్ వారు తమ రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి, అలాగే వేగంగా ఎదుగుతున్న జాతీయవాద ఉద్యమాన్ని బలహీనపరిచే ప్రయత్నంగా, మతపరమైన విభేదాలను ఆయుధాలుగా మార్చుకున్నారు.
b)
ఉదాహరణ: 1905లో జరిగిన బెంగాల్ విభజనను అధికారికంగా పరిపాలనా సౌలభ్యం కోసమని ప్రకటించినా, దాని అసలు ఉద్దేశ్యం హిందూ- ముస్లిం ఐక్యతను ఛిన్నాభిన్నం చేయడమే. ఈ చర్య తదుపరి మతపరమైన రాజకీయ వ్యూహాలకు ప్రేరణగా మారింది.
2. మత రాజకీయాల ఆరంభం
a) విభిన్న మతాలవారు తమను తాము వేర్వేరు రాజకీయ సమూహాలుగా గుర్తించడం ప్రారంభించారు. ఇది మత ఆధారిత రాజకీయాల ఆవిర్భావానికి దారితీసింది.
b)
ఉదాహరణ: 1906లో స్థాపితమైన అఖిల భారత ముస్లిం లీగ్ మరియు 1915లో ఏర్పడిన హిందూ మహాసభ — ఈ రెండు సంస్థలు జాతీయవాద ప్రయోజనాల కంటే మతపరమైన రాజకీయ లక్ష్యాలపై ఎక్కువ ఆసక్తిని చూపాయి.
3. ప్రత్యేక రాజకీయ డిమాండ్లు
a) మతతత్వ సంస్థలు తమ వర్గాల కోసం ప్రత్యేక రాజకీయ హక్కులు కావాలని డిమాండ్ చేయడం ప్రారంభించాయి.
b)
ఉదాహరణ: 1909 మోర్లీ-మింటో సంస్కరణల ద్వారా ప్రత్యేక మత నియోజకవర్గాలను ప్రవేశపెట్టడం జరిగింది. దీని ఫలితంగా, రాజకీయ ప్రాతినిధ్యంలో మతపరమైన విభజనలను బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా గుర్తించినట్లైంది.
4.
జాతీయవాద కార్యకలాపాల్లో మతపరమైన అంశాలు
a) భారత జాతీయవాద ఉద్యమాల్లో కొన్ని మతపరమైన సంకేతాలు, ఉత్సవాలు, నినాదాల వినియోగం హిందూ ప్రజానీకాన్ని ఒకతాటిపైకి తెచ్చినప్పటికీ, ఇతర మతాలకు చెందిన ప్రజలను జాతీయోద్యమానికి దూరం చేస్తూ భారతీయుల మధ్య ఐక్యతను దెబ్బతీసిన సందర్భాలున్నాయి.
b)
ఉదాహరణ: వందేమాతరం వంటి నినాదాలు, గోరక్షణ ఉద్యమాలు, గణేశ్ ఉత్సవం లాంటి బహిరంగ వేడుకలు హిందూ సమాజాన్ని సంఘటితం చేయడంలో ముఖ్యపాత్ర వహించాయి. అయితే, ఈ కార్యక్రమాల్లో ముస్లింలు తమను సాంస్కృతికంగా బహిష్కృతులుగా భావించారు, తద్వారా మతపరమైన దూరం పెరిగింది.
5. ద్విజాతి సిద్ధాంతం - ఐక్యత విఫలం కావడం:
a) మతతత్వం పెరిగి, విభజన ధోరణి బలపడటానికి మరియు వివిధ మతాల మధ్య ఐక్యత బలహీనపడుటకు కారణమైంది. దీని ఫలితంగా హిందూ-ముస్లిం ఐక్యత కోసం చేసిన ప్రయత్నాలు నెమ్మదిగా క్షీణించాయి.
b)
ఉదాహరణ: 1940లో అఖిల భారత ముస్లిం లీగ్ ఆమోదించిన లాహోర్ తీర్మానం, ద్విజాతి సిద్ధాంతానికి అధికారికంగా మద్దతిస్తూ, ముస్లింల కోసం వేరే దేశం అవసరమని పేర్కొంది. అంతకుముందే, 1922లో ఖిలాఫత్-సహాయ నిరాకరణ ఉద్యమాల్లో హిందూ-ముస్లింల సయోధ్యకై చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడం ఈ విభేదాలకు మరింత బలాన్నిచ్చింది.
మతతత్వం మరియు దేశ విభజన
1. మత రాజకీయాలు
a) మతమనేది రాజకీయ సమీకరణ మరియు ప్రాతినిధ్యానికి కేంద్రబిందువుగా మారింది. ఎన్నికల్లో మతం ఆధారంగా అభ్యర్థులు నిలబడటం, ఓట్లు అడిగే సాంప్రదాయం మొదలైంది.
b)
ఉదాహరణ: 1937లో యునైటెడ్ ప్రావిన్సెస్ (యూపీ)లో భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడం, ముస్లిం లీగ్ వాదన అయిన "హిందూ బాహుళ్య దేశంలో ముస్లింలు రాజకీయంగా నిర్లక్ష్యానికి గురవుతున్నారు" అనే భావనకు బలాన్నిచ్చింది.
2. సామూహిక సమీకరణ
a) మత విద్వేష ప్రచారాల వలన ఇరు వర్గాల మధ్య భయాందోళనలు మరియు ఒకరిపై ఒకరికి అపనమ్మకం కలిగింది.
b)
ఉదాహరణ: హిందూ మహాసభ, ముస్లిం లీగ్ రెండూ తమ ప్రచారాల ద్వారా ఇతర మతాల నుండి హాని ఉందని నమ్మబలికాయి. దానితో సమాజంలో భయానక వాతావరణం నెలకొంది.
3. మతపరమైన హింస
a) వేర్వేరు మతాల మధ్య చెలరేగిన హింస, మత కలహాలు విభజనకు కారణమయ్యాయి.
b)
ఉదాహరణ: 1946లో డైరెక్ట్ యాక్షన్ డే (Direct Action Day) కలకత్తాలో అల్లర్లకు దారితీయగా, అదే సంవత్సరం నోఖాలీ అల్లర్లు (Noakhali riots) మత కలహాలు, విద్వేషాలకు దారితీయటంతో పాటు దేశ విభజనను అనివార్యం చేశాయి.
4. విభజనవాదం ప్రజాదరణను పొందడం
a) ఇటువంటి ఉద్రిక్త వాతావరణంలో, కొందరి దృష్టిలో విభజన సమాజంలో శాంతిని సాధించడానికి ఎంతో అవసరమైన ప్రత్యామ్నాయంగా మారింది.
b)
ఉదాహరణ: "పాకిస్తాన్ రావడమా లేక విధ్వంసమా" అనే నినాదం 1946–47 మధ్య విస్తృతంగా వినిపించగా, ముస్లింలలో దేశ విభజనకు అనుకూలత లభించింది. దీనివల్ల వేర్పాటు భావనకు రాజకీయంగా కూడా మద్దతు లభించింది.
5. రాజకీయ చర్చల వైఫల్యం
a) మత సంస్థలు, రాజకీయ పార్టీలు తమ మతపరమైన హక్కుల విషయంలో రాజీ పడే స్థితిలో లేకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి.
b)
ఉదాహరణ: 1946లోని క్యాబినెట్ మిషన్ ప్లాన్ లక్ష్యం, భారతదేశాన్నిఒక్కటిగా ఉంచేందుకు రాజ్యాంగ పరిష్కారాన్ని కనుగొనడం అయినప్పటికీ, కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య ఏకాభిప్రాయం లోపించడంతో, ఈ చర్చలు విఫలమయ్యాయి. దానితో దేశ విభజన అనివార్యమయింది.

ముగింపు:
1947లో జరిగిన దేశ విభజన ఒక ముఖ్యమైన చరిత్రాత్మక హెచ్చరికగా చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది. సామాజిక, మత విభేదాలు రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేసినప్పుడు ఎలాంటి తీవ్రమైన పరిణామాలు ఉత్పన్నమవుతాయో తెలియజేయడమేగాక. భారతదేశంలాంటి బహుళసాంస్కృతిక, బహుళమత సమాజంలో వేర్వేరు వర్గాల మధ్య పరస్పర నమ్మకాన్ని నిర్మించటం, కలసికట్టుగా చర్చలకు అవకాశం కల్పించడం, మరియు సామాజిక సౌభ్రాతృత్వాన్ని బలపరచడం ఎప్పటికీ ముఖ్యమేనన్న సందేశాన్ని ఈ చారిత్రక సంఘటన మనకు గుర్తుచేస్తోంది.

Additional Embellishment: