There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Thu Apr 10, 2025
పరిచయం:
విజయనగర సామ్రాజ్యం (1336-1646) దక్షిణ భారతదేశంలోని తుంగభద్రా నదీ తీరంలో ఒక ప్రముఖ హిందూ సామ్రాజ్యంగా విలసిల్లింది. శ్రీకృష్ణ దేవరాయలు వంటి పాలకుల కాలంలో ఈ సామ్రాజ్యం వ్యవసాయ, వాణిజ్య, సాంస్కృతిక రంగాలలో విశేష అభివృద్ధిని చూసింది.
విషయం:
సామాజిక పరిస్థితులు:
1) వర్ణ వ్యవస్థ:
· విజయనగర సమాజం వైదిక వర్ణ వ్యవస్థపై ఆధారపడింది. బ్రాహ్మణులు మతపరమైన మరియు విద్యాపరమైన అధికారాలను కలిగి ఉండగా, క్షత్రియులు రాజకీయ మరియు సైనిక శక్తిగా వ్యవహరించారు.
· వైశ్యులు వ్యాపారం మరియు వ్యవసాయంలో పాల్గొనగా, శూద్రులు శ్రమ ఆధారిత పనుల్లో నిమగ్నమవుతూ ఓ సమ్మిళిత సమాజ నిర్మాణంలో భాగమయ్యారు.
2) స్త్రీల స్థానం:
· స్త్రీల స్థితి సామాజిక వర్గాన్ని బట్టి మారుతూ ఉండేది. ఉన్నత వర్గాల్లోని స్త్రీలు విద్య మరియు సాహిత్య కళల్లో పాల్గొనగలిగినా, సామాన్య స్త్రీలు గృహ కార్యకలాపాలకే పరిమితమయ్యారు.
· ఉదా: గంగా దేవి "మధుర విజయము" అనే రచనతో విశేష ప్రజాదరణను చూడగొనగా, తిరుమలాంబ "వరదాంబికా పరినయము" అనే కన్నడ రచన ద్వారా ప్రసిద్ధి పొందారు.
3) మతం మరియు సంస్కృతి:
· విజయనగర పాలకులు హిందూ మతాన్ని ప్రోత్సహించారు, దేవాలయ నిర్మాణాలకు ఎనలేని సేవ ఇచ్చారు (ఉదా: హంపీలోని విరూపాక్ష దేవాలయం).
· శైవం, వైష్ణవం వంటి శాఖలు వర్ధిల్లాయి, అలాగే జైన మరియు బౌద్ధ మతాలకు కూడా కొంత ఆదరణ లభించింది.
· కృష్ణదేవరాయలు వంటి రాజులు పరమతసహనానికీ, హిందూ మరియు ముస్లింల సఖ్యత, సోదరభావాలు నెలకొల్పేందుకు ఎంతగానో కృషి చేసారు.
4) ఆహార పద్ధతులు:
· విజయనగర ప్రజల ఆచార పద్దతులను ఇతర ప్రాంతాలతో వీరి వాణిజ్య సంబంధాలు మరియు స్థానిక ఆచారాలు, తుంగభద్ర నాదీ తీరాన ఆహార లభ్యత ఎంతగానో ప్రభావితం చేసింది. వీరు విభిన్నమైన ఆహారపద్ధతులు పాటించేవారు. అన్నం, జొన్నలు, పప్పు ధాన్యాలు మరియు మిరియాలు మొదలైన వాటిని ఎక్కువగా ఇష్టపడేవారు. చేపలు, మాంసాహారం కూడా సాధారణంగా తీసుకునేవారు.
5) విద్య మరియు సాంస్కృతిక పోషణ
· వీరి కాలంలో దేవాలయాలు విద్యా కేంద్రాలుగా వర్ధిల్లాయి. సంస్కృతం మరియు వేద గ్రంథాల అధ్యయనం విస్తృతంగా కొనసాగింది. ఉదాహరణకి, హంపిలోని విరుపాక్షా దేవాలయం ప్రముఖ విద్యా కేంద్రంగా వర్ధిల్లింది. శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానమైన భువన విజయంలో అష్టదిగ్గజ కవులు విశేష రాజాదరణను చూరగొన్నారు. విద్యారణ్య స్వామి వంటి పండితులు వేదాంత తత్వాన్ని అభివృద్ధి చేశారు.
ఆర్థిక పరిస్థితులు
1) వ్యవసాయం:
· విజయనగర సామ్రాజ్యం యొక్క ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడి ఉండేది. విజయనగర పాలకులు ఆధునిక నీటి సరఫరా వ్యవస్థలు ఏర్పాటు చేయడంతో తుంగభద్రా మైదాన ప్రాంతంలో వ్యవసాయ రంగం పతాక స్థాయికి చేరుకుంది. వరి, పత్తి, మరియు మిరియాల వంటి ప్రధాన పంటల సాగు వలన వాణిజ్య రంగం కూడా ఎంతగానో అభివృద్ధి చెందింది.
2) వాణిజ్య సంబంధాలు · కాటన్ వస్త్రాలు, మిరియాలు, విలువైన రంగు రాళ్లు వంటి వాటిని పెర్షియా, పోర్చుగల్ మరియు అరేబియా మార్కెట్లకు ఎగుమతి చేసేవారు. వీరి రాజధాని అయిన హంపి ఓ ప్రధాన వర్తక కేంద్రంగా అభివృద్ధి చెందింది.
3) కరెన్సీ విధానం:
· బంగారం, వెండి, మరియు రాగి నాణేలతో ఓ బలమైన కరెన్సీ విధానాన్ని నాటి పాలకులు ఏర్పాటు చేసారు. దానితో మెరుగైన వర్తక వాణిజ్య వ్యాపార సంబంధాలు మరియు ఆర్థిక స్థిరత్వం సాధ్యపడింది.
4) పట్టణీకరణ మరియు మౌలిక సదుపాయాలు:
· వీరి రాజధాని అయిన హంపి గొప్ప ప్రణాళికతో నిర్మించబడిన మార్కెట్లు, దేవాలయాలు, కోటలు మరియు నీటి సరఫరా వ్యవస్థలను కలిగి ఉండేది. ప్రజల జీవనరీతిని మరియు వాణిజ్యాన్ని సులభతరం చేసేవిధంగా ప్రజా మౌలిక సదుపాయాలు, విశ్రాంతి భవనాలు, రహదారులు మొదలైనవి ఏర్పాటు చేయబడ్డాయి.
5) హస్తకళలు మరియు వైభవోపేతమైన నిర్మాణాలు:
· విజయనగర సామ్రాజ్యం ఎంతో అందమైన కళాకృతులకు ప్రసిద్ధి గాంచింది. విరుపాక్ష దేవాలయం మరియు విట్టల దేవాలయం వంటి ప్రముఖ నిర్మాణాలు వీరి యొక్క సంపద మరియు సాంస్కృతిక విలువలకు అద్దం పడుతుంది.
ముగింపు:
ప్రముఖ చరిత్రకారుడైన K.A. నీలకంఠ శాస్త్రి అన్నట్లుగా, "విజయనగర సామ్రాజ్యం ఒక సుసంపన్న భూమి." వ్యవసాయం, వాణిజ్యం, మరియు సాంస్కృతిక పోషణలో ఈ సామ్రాజ్యం సాధించిన విజయాలు దక్షిణ భారతదేశ చరిత్రపై ఓ చెరగని ముద్ర వేశాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.