TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES

Sun Apr 20, 2025

Q. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ యుగపు ప్రాముఖ్యతను వివరించండి.

పరిచయం:
1919 నుండి 1947 వరకు గాంధేయ పోరాట విధానాలతో కొనసాగిన జాతీయోద్యమ కాలమే గాంధీ యుగం (1919-1947). భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ముఖ్యమైన ఘట్టంగా నిలిచిన ఈ కాలం సామాన్య ప్రజానీకాన్ని బ్రిటీషు వలసవాద పాలనకు వ్యతిరేకంగా ఏకం చేయడమే కాక జాతీయవాద భావజాలాన్ని ప్రతీ ప్రాంతానికి చేర్చడంలో కీలక పాత్ర పోషించింది.

విషయం:
గాంధేయ సిద్ధాంతాలు
1. అహింస (హింసారహిత జీవనం): 
-అహింసావాదం గాంధీ జీవన సిద్ధాంతంగా మరియు సామాజిక-రాజకీయ మార్పులకై గాంధీ యొక్క ఓ ముఖ్యమైన వ్యూహంగా నిలిచింది. నైతిక విలువలకు లోబడి స్వాతంత్య్ర పోరాటాన్ని సాగించడంలో ఈ విధానం ఎంతగానో దోహదపడింది.
2. సత్యాగ్రహం: 
-సత్యాగ్రహం, అంటే సత్యానికి కట్టుబడి ఉంటూ సాగించే ఒక అహింసాయుత పోరాటం. 1917లో చంపారన్ సత్యాగ్రహంలో రైతులపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గాంధీ దీనిని మొదటిసారి అమలు చేశారు.
3. సామాజిక సంస్కరణలు మరియు సామాజిక న్యాయం: 
-అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాడి, హరిజనుల (దళితుల) హక్కుల కోసం మహాత్మ ఎంతగానో కృషి చేశారు. మహిళల హక్కులు మరియు స్వాతంత్య్ర ఉద్యమంలో వారి చురుకైన పాత్రను ప్రోత్సహించారు.
4. ఆర్థిక స్వావలంబన మరియు స్వదేశీవాదం: 
-ఖాదీని ఆర్థిక స్వాతంత్య్ర చిహ్నంగా గాంధీ పేర్కొన్నారు. విదేశీ వస్తువుల బహిష్కరణ మరియు స్వదేశీ ఉద్యమం ద్వారా ఆర్ధిక స్వావలంబనను సాధించవచ్చని భావించారు.
5. హిందూ-ముస్లిం ఐక్యత మరియు లౌకికవాదం: 
-ఖిలాఫత్ ఉద్యమం ద్వారా హిందూ-ముస్లిం ఐక్యత కోసం గాంధీ ఎంతగానో కృషి చేశారు. మత విభేదాలు లేని ఏకీకృత భారతం కోసం లౌకికవాదాన్ని ప్రచారం చేశారు.
గాంధీజీ నిర్వహించిన ఉద్యమాలు
1. సహాయ నిరాకరణ ఉద్యమం: 
-1919లో జలియన్‌వాలా బాగ్ ఉదంతం తరువాత గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. బ్రిటిష్ వస్తువులు, సేవలు, మరియు సంస్థలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
-1922లో చౌరీ చౌరా సంఘటనలో హింస జరగడంతో, తాను నమ్మిన అహింసావాదాన్ని నిలబెట్టేందుకు గాంధీ ఈ ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, తన నైతిక నిబద్ధతను చాటి చెప్పారు. ఆర్ధిక స్వావలంబన మరియు అహింసావాదంపై ఈ ఉద్యమం దృష్టి సారించి, భవిష్యత్ ఉద్యమాలకు పునాది వేసింది.
2. శాసనోల్లంఘన ఉద్యమం మరియు ఉప్పు సత్యాగ్రహం (1930) 
-బ్రిటిషు వారి ఉప్పు చట్టాలను ధిక్కరిస్తూ గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేపట్టారు. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చింది.
-శాసనోల్లంఘన ఉద్యమం (1930-1934) ప్రజా వ్యతిరేక బ్రిటిష్ చట్టాలు మరియు పన్నులను నిరసిస్తూ మొదలై తద్వారా బ్రిటిష్ అధికారాన్ని సవాలు చేసింది.
3. క్విట్ ఇండియా ఉద్యమం (1942) 
-రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో గాంధీ బ్రిటిష్ వారిని తక్షణం భారత్‌ను వీడాలని డిమాండ్ చేస్తూ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు.
-భారీ ఎత్తున అరెస్టులు జరిగినప్పటికీ, రహస్య కార్యకలాపాల ద్వారా ఈ ఉద్యమం కొనసాగి, 1947లో స్వాతంత్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించింది.
4. ప్రజా భాగస్వామ్యం 
-గాంధీ గ్రామీణ ప్రజలతో సహా సమాజంలోని అన్ని వర్గాలను సమీకరించడంలో విజయం సాధించారు. రైతులు, కార్మికులు, మహిళలను ఉద్యమంలో భాగస్వాములను చేసి, స్వాతంత్య్ర పోరాటాన్ని జాతీయ సమష్టి బాధ్యతగా ప్రజలు భావించేలా చేశారు.
5. రాజకీయ వ్యూహంలో అహింస యొక్క పాత్ర 
-ఆయుధ పోరాటం లేకుండా బ్రిటిష్ అధికారాన్ని కూల్చేందుకు గాంధీ అహింసా వాదాన్ని బలంగా ఉపయోగించారు. · ఆయన అహింస సిద్ధాంతం మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా వంటి ప్రపంచ నాయకులను ఎంతగానో స్ఫూర్తినివ్వడమేగాక శాంతియుత నిరసనలతో రాజకీయ మార్పులు సాధ్యపడతాయని నిరూపించింది.

ముగింపు
గాంధీ తన ఆజన్మాంతం సాగించిన అహింసా ఉద్యమాలు, నైతిక విలువలకు లోబడి సాగిన ఆయన బలమైన నాయకత్వం ద్వారా భారత స్వతంత్రతను సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన సిద్ధాంతాలు భారత ప్రజాభిప్రాయ విలువలను, సామాజిక స్పృహనే కాక ప్రపంచవ్యాప్తంగా న్యాయం మరియు మానవ హక్కుల సాధనకై జరుగుతున్న శాంతియుత ఉద్యమాలకు నేటికీ స్ఫూర్తినిస్తున్నాయి.

Additional Embellishment: