There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Wed Apr 23, 2025
పరిచయం:
భారతదేశంలో క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో వైదిక మతానికి వ్యతిరేకంగా అనేక మతోద్యమాలు పుట్టుకొచ్చాయి. ఈ ఉద్యమాలన్నీ ఆనాటి బ్రాహ్మణ ఆధిపత్య సమాజాన్ని, జంతుబలులు మరియు యజ్ఞయాగాలతో కూడిన వైదిక మతాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ క్రమంలోనే బౌద్ధ జైన ఉద్యమాలు పరిపూర్ణమైన మతాలుగా ఆవిర్భవించి విశేష ఆదరణ పొందాయి.
విషయం:
I. బౌద్ధమతం మరియు జైనమతాల ఆవిర్భావానికి అనుకూలమైన సామాజిక పరిస్థితులు:
1. కఠినమైన వర్ణ వ్యవస్థ
ఎ) బ్రాహ్మణ సమాజం శూద్రులను మరియు స్త్రీలను ఆధ్యాత్మికత మరియు మఠాకార్యకలాపాల నుండి నుండి దూరం చేసింది. దీనివల్ల సామాజిక అసమానతలు తలెత్తాయి.
బి) బుద్ధుడు మరియు మహావీరుడు శూద్రులను, స్త్రీలను సంఘాలలో చేర్చుకొని, జన్మ తహా కాకుండా కర్మ ఫలితాల ఆధారంగా మోక్షం కలుగుతుందని ప్రచారం చేశారు. ఉదాహరణకు, క్షరకుడైన ఉపాలి బౌద్ధ సంఘంలో ప్రముఖ సన్యాసిగా గుర్తింపు పొందాడు.
2. బ్రాహ్మణాధిపత్యం మరియు నైతిక సంస్కరణలు
ఎ) వైదిక మతంలో ఖర్చుతో కూడిన యజ్ఞ, యాగాలు మరియు బ్రాహ్మణులచే నిర్వహించబడే జంతు బలులు సమాజం లో అశాంతిని కలుగజేసాయి.
బ) బౌద్ధ మరియు జైనమతాలు ఈ కఠినమైన ఆచారాలను, సంప్రదాయాలను తిరస్కరించి, అహింస, ధ్యానం మరియు నైతిక జీవనాన్ని మోక్షానికి నిజమైన మార్గంగా ప్రచారం చేశాయి.
3. నైతిక విలువల క్షీణత
ఎ) మతాచారాలు కఠినంగా మారి, రోజువారీ జీవనంలో నైతిక విలువల ప్రాముఖ్యతను నిర్వీర్యం చేశాయి.
బి) బౌద్ధమతం అష్టాంగ మార్గాలను ప్రచారం చేసింది. అలాగే జైనమతం సత్యం, అహింస, సరైన ప్రవర్తనను ప్రోత్సహించే పంచ సూత్రాలను బోధించింది.
4. సమానత్వ లేమి
ఎ) వైశ్యులైన వ్యాపారులు, చేతివృత్తుల వారు ఆర్థికంగా సుసంపన్నులైనప్పటికీ కఠినమైన వర్ణ వ్యవస్థ కారణంగా సమాజంలో వారి గుర్తింపు మరియు ప్రాముఖ్యతను కోల్పోయారు.
బి) బౌద్ధ, జైనమతాలు వారికి ఆధ్యాత్మిక స్వేచ్ఛను, సామాజిక గౌరవాన్ని అందించాయి. వైశాలి మరియు రాజగృహం వంటి వర్తక కేంద్రాలు ఈ మతాలకు ముఖ్య కేంద్రాలుగా మారడం దీనికి ఒక ఉదాహరణ.
5. మేధోపరమైన మరియు హేతుబద్ధమైన చర్చలు
ఎ) శ్రమణ ఉద్యమం వైదిక ఆధిపత్యాన్ని ప్రశ్నించే తాత్విక వాతావరణాన్ని సృష్టించింది.
బి) బుద్ధుడు తన బోధనలలో చర్చలు మరియు హేతుబద్ధమైన ఆలోచనలను ప్రోత్సహించాడు. ఉదాహరణకు ఇతర మత గురువులతో జరిపిన చర్చలు సైతం సుత్త పీటికలో నమోదు చేయబడ్డాయి.
II. బౌద్ధమతం మరియు జైనమతాల వ్యాప్తికి దోహదపడిన ఆర్థిక పరిస్థితులు:
1. పట్టణీకరణ మరియు వ్యాపారుల పోషణ
ఎ) ఉజ్జయిని, వైశాలి, రాజగృహం వంటి నగరాల ఆవిర్భావం ప్రభావవంతమైన వ్యాపార వర్గాన్ని సృష్టించింది.
బి) వ్యాపారులు వారి వృత్తి నియమాల పట్ల గౌరవంతో అవైధిక మతాలకు మద్దతు ఇవ్వడంతో పాటు, చైత్య విహారాలకు అనేక దానాలు చేసారు. ఉదాహరణకు, అనాథపిండికుడు బుద్ధునికి జేతవన విహారాన్ని దానం చేశాడు.
2. శ్రేణుల పోషణ:
ఎ) చేతివృత్తులవారు మరియు వ్యాపార శ్రేణులు బౌద్ధమతం మరియు జైనమతాల బోధనల పట్ల ఆకర్షితులయ్యారు.
బి) ఈ శ్రేణులు విహారాలకు, విద్యాకేంద్రాలకు నిధులు సమకూర్చాయి. సాంచి మరియు అమరావతి శాసనాలు ఈ శ్రేణులు చేసిన దానాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.
3. వ్యవసాయ విస్తరణ మరియు అహింసావాదం
ఏ) వ్యవసాయంలో నాగలిని విరివిగా ఉపయోగించడం వల్ల ఆనాటి సమాజాలలో పశు సంపద యొక్క ప్రాముఖ్యత పెరిగింది. వ్యవసాయ కార్యకలాపాలకు జంతువులు కీలకమైనవిగా మారాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఇది ఒక కీలకమైన మార్పుగా చెప్పవచ్చు.
బి) బౌద్ధ, జైనమతాలు జంతు బలులను వ్యతిరేకించాయి. దానితో వ్యవసాయ కుటుంబాలు ఈ నూతన మతాల పట్ల ఆకర్షితులయ్యారు. ఉదాహరణకు, జైనమతం అహింసా సిద్ధాంతాన్ని సమగ్రంగా అనుసరించే జీవన విధానాన్ని ప్రోత్సహిస్తూ కీటకాలకు కూడా హాని చేయరాదని బోధించింది.
4. సంఘాలకు ఆర్థిక స్వాతంత్య్రం
ఏ) రాజులు, వ్యాపారులు మరియు ఉన్నత వర్గాల ప్రజలు సంఘాలు మరియు వైదిక మఠాలకు భూమిని దానంగా ఇచ్చేవారు. దీంతో వాటిక ఆర్థిక స్వతంత్రత లభించింది.
బి) ఈ మఠాలు మరియు సంఘాలు విద్య, దానధర్మాలు మరియు ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారాయి. ఉదాహరణకు, నలంద మరియు వల్లభి విశ్వవిద్యాలయాలు విద్యా కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇవి భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించాయి.
5. నైతికపరమైన ఆర్థిక విధానాల ఆవిర్భావం
ఏ) నగర వర్గం నీతి మరియు వ్యాపారంలో నైతిక ప్రవర్తనను కోరుకున్నాయి.
బి) బౌద్ధమతం తన అష్టాంగ మార్గంలో "సరైన జీవనోపాధి" ని ప్రముఖంగా ప్రస్తావించింది. అదే విధంగా జైనమతం సత్యం మరియు నైతిక జీవనోపాధి సూత్రాలను అమలు చేసింది.
ముగింపు
ఈ విధంగా, బౌద్ధ మరియు జైనమతాలు సామాజిక అసమానతలు మరియు ఆర్థిక మార్పులకు ప్రతిస్పందనగా ఆవిర్భవించాయి. నైతిక సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడమే గాక ఈ మతాలకు అనుబంధంగా ఏర్పడిన నలందా వంటి విద్యా సంస్థలు, అశోకుని ధమ్మ విధానం మొదలగునవి ఆసియా అంతటా భారతీయ సంస్కృతిని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించాయి.
Additional Embellishment: