TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES

Sun May 4, 2025

Q. శాతవాహనుల పాలనలో దక్కను ప్రాంతంలోని సామాజిక-ఆర్థిక మరియు సాంస్కృతిక పరిస్థితులపై విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించండి.

పరిచయం:
మౌర్య సామ్రాజ్యం అంతమైన తర్వాత తెలంగాణ మరియు దక్షిణ భారతదేశంలో మహా సామ్రాజ్యాన్ని స్థాపించిన మొదటి రాజవంశం శాతవాహనులు. వీరు క్రీ.పూ. 1వ శతాబ్దం నుండి క్రీ.శ. 3వ శతాబ్దం వరకు పాలించారు. ప్రముఖ చరిత్రకారుడు కె.ఎం. పణిక్కర్ ప్రకారం, "శాతవాహనులు దక్షిణ భారతదేశం మరియు ఆర్యవర్తాల మధ్య సాంస్కృతిక సమైక్యతలో కీలక పాత్ర పోషించారు."

విషయం:
ప్రధాన సామాజిక
-ఆర్థిక పరిస్థితులు:
1. వ్యవసాయం
-
శాతవాహనుల ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం ప్రధాన ఆధారంగా ఉండేది. దీనిని ప్రతిష్ఠానపురం/పైఠణ్ వద్ద లభించిన ఇనుప నాగళ్లు వంటి సాధనాలు మరియు నీటిపారుదల వ్యవస్థలు సమర్థిస్తున్నాయి. గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క నాసిక్ శాసనం, రాజభోగం (పంటలో ఆరవ వంతు) రూపంలో భూమి శిస్తు సేకరించినట్లు పేర్కొంటుంది.
2. వ్యాపారం & వాణిజ్యం
-
శాతవాహనులు స్వదేశీ మరియు విదేశీ వాణిజ్యంలో చురుకుగా పాల్గొన్నారు. ముఖ్యంగా రోమన్ సామ్రాజ్యంతో వీరి వ్యాపారం కొనసాగింది. పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రేయన్ సీ అనే గ్రంథం, కళ్యాణ్ మరియు భరూచ్ ఓడరేవుల నుండి పత్తి మరియు సుగంధ ద్రవ్యాలు ఎగుమతి అయ్యేవని తెలియజేస్తుంది. తేర్ మరియు నాగార్జునకొండ వద్ద లభించిన రోమన్ నాణేలు ఈ వాణిజ్య సంబంధాన్ని నిరూపిస్తున్నాయి.
3. శ్రేణీ వ్యవస్థ మరియు నాణేల ఆర్థిక వ్యవస్థ
-
నేత కార్మికులు (కోలిక), బంగారు పనివాళ్లు (సువర్ణకార) వంటి వివిధ శ్రేణీలు (సంఘాలు) ఉత్పత్తి మరియు వాణిజ్యాన్ని నియంత్రించాయి. నాసిక్ శాసనాలు శక్తివంతమైన శ్రేణి (సంఘ నాయకుల) వ్యవస్థల గురించి పేర్కొంటున్నాయి. సువర్ణ మరియు కర్షపణ అనే నాణేల జారీ, ఆర్థిక వ్యవస్థ యొక్క నాణెమయీకరణను సూచిస్తుంది.
4. సామాజిక నిర్మాణం మరియు స్త్రీల స్థానం
-
ఎ.ఎల్. భాష్యం వివరించినట్లు, వృత్తి సంఘాల నుండి ఉద్భవించిన సౌకర్యవంతమైన వర్ణ వ్యవస్థను ఆనాటి సమాజం అనుసరించింది. గాథాసప్తశతి కులాంతర వివాహాల గురించి పేర్కొంటుంది. అంతేకాక స్త్రీలకు ఆస్తి హక్కు ఉండడంతో మతపరమైన దానాలు కూడా చేసేవారు అని నాసిక్ శాసనం తెలియజేస్తుంది.
సామాజిక-ఆర్థిక పరిస్థితులపై గల పరిమితులు:
1. అసమాన భూ యాజమాన్యం
-
నానాఘాట్ మరియు నాసిక్ శాసనాలలో వివరించినట్లు, బ్రాహ్మణులకు మరియు బౌద్ధ విహారాలకు అగ్రహార రూపంలో పెద్ద మొత్తంలో భూ దానాలు చేయడం వల్ల భూమి ఉన్నత వర్గాల చేతుల్లో కేంద్రీకృతమైంది. ఈ విషయాన్ని చరిత్రకారుడు డి.డి. కౌశాంభి విమర్శనాత్మకంగా వివరించారు.
2. రైతులపై భారీ పన్ను భారం
-
రాజభోగం, దేయమేయం మరియు వృత్తి పన్నుల వంటి బహుళ పన్నులు రైతులకు ఆర్థిక ఒత్తిడిని కలిగించాయి. నాసిక్ శాసనం ద్వారా ఈ విషయం స్పష్ఠమౌతుంది. అలాగే చరిత్రకారుడు ఆర్.ఎస్. శర్మ కూడా దీనిని వివరించారు.
3. ఆర్థిక వ్యవస్థపై బలహీన రాజ్యాధికారం
-
శ్రేణులలో పెరుగుతున్న స్వాతంత్ర్యం ఆర్థిక వ్యవస్థలో సామంతీకరణ ధోరణులకు కారణం అయ్యిందని నాసిక్ శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ భావనను చరిత్రకారుడు డి.ఎన్.ఝా వివరించాడు.
4. ఆర్థిక అసమానతలు
-
ధనవంతులైన వ్యాపారుల బహుళ అంతస్తుల గృహాలు మరియు పేద రైతుల గడ్డి కుటీరాల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని గాథాసప్తశతి మరియు అమరావతి శిల్పాలు చూపిస్తాయి.
5. సామాజిక దురాచారాలు — బహుభార్యాత్వం మరియు సతీ సాంప్రదాయం
-
స్త్రీలకు కొన్ని హక్కులు ఉన్నప్పటికీ, గాథాసప్తశతిలో పేర్కొన్నట్లు, ఉన్నత వర్గాలలో బహుభార్యాత్వం సాధారణంగా కొనసాగింది. అలాగే, గ్రీకు చరిత్రకారుడు స్ట్రాబో, దక్షిణ భారతదేశంలో సతీ సాంప్రదాయం ఉన్నట్లు స్పష్టంగా పేర్కొన్నాడు. ఇది పితృస్వామ్య దోపిడీని ప్రతిబింబిస్తుంది.
ప్రధాన సాంస్కృతిక పరిస్థితులు:
1. సంయుక్త సంస్కృతి మరియు కళాత్మక సమ్మేళనం
-
శాతవాహన యుగం ఆర్య మరియు ద్రావిడ సంస్కృతుల సమ్మేళనానికి సాక్ష్యంగా నిలిచింది. అమరావతి స్తూపం మరియు నాసిక్ గుహలు వంటి వాస్తుశిల్పలలో ఈ సమన్వయం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని చరిత్రకారుడు కె.ఎ. నీలకంఠ శాస్త్రి వివరించారు.
2. మత బహుళత్వం మరియు ఆశ్రయం
-
శాతవాహన పాలకులు అనేక మతాలను ఆధరించారు. మొదటి శాతకర్ణి చేసిన అశ్వమేధ యాగం వంటి వైదిక యజ్ఞాలు, లీలావతిలో ప్రశంసించబడిన శైవం, గాథాసప్తశతిలో కనిపించే వైష్ణవం, మరియు అమరావతి, నాగార్జునకొండలలో విలసిల్లిన బౌద్ధం ఈ విషయాన్ని సూచిస్తాయి.
3. సాహిత్య వికాసం
-
హాలుడు ప్రాకృత భాషలో రచించిన గాథాసప్తశతి, సమకాలీన సామాజిక జీవనానికి సంబంధించిన సూక్ష్మ అవగాహనను అందిస్తుంది.
4. సమృద్ధమైన పండుగలు మరియు సాంస్కృతిక జీవనం
-
కామసూత్రాలలో పేర్కొన్న ఉద్యానగమనం, మదనోత్సవం మరియు హలక వంటి పండుగలు శాతవాహన యుగంలోని ఉత్సాహభరితమైన సాంస్కృతిక జీవనాన్ని సూచిస్తున్నాయి.
5. శిల్పకళ, వాస్తుశిల్పం మరియు సంగీతంలో పురోగతి
-
వీణ, మృదంగం వంటి వాద్యాల వినియోగం మరియు అమరావతి బౌద్ధ స్మారకాల నిర్మాణం వంటివి ఆ కాలం నాటి సంగీతం మరియు కళల సమృద్ధిని తెలియజేస్తున్నాయి.
సాంస్కృతిక పరిస్థితులపై గల పరిమితులు:
1. ఉన్నత వర్గ కేంద్రీకృత సాంస్కృతిక ఆశ్రయం
-
సాంస్కృతిక పరిణామాలు ప్రధానంగా ఉన్నత వర్గాలకు పరిమితమయ్యాయి. గాథాసప్తశతిలో కనిపించే ఈ ధోరణి, సామాన్య ప్రజల సంస్కృతికి తక్కువ ప్రాతినిధ్యాన్ని ఇచ్చినట్లు తెలుస్తుంది.
2. భూదానాల వల్ల రాజ్య వనరుల క్షీణత
-
నాసిక్ మరియు నానాఘట్ శాసనాల ప్రకారం, మత సంస్థలకు విస్తృతంగా భూములు కట్టబెట్టడం రాజ్య ఆర్థిక వనరులను బలహీనపరిచింది. మతపరమైన అసమానతలను ప్రోత్సహించింది. ఈ విషయాన్ని చరిత్రకారుడు ఆర్.ఎస్. శర్మ విశ్లేషించారు.
3. పరిమితమైన అఖిల భారత ప్రభావం
-
శాతవాహన కళలు మరియు సాహిత్యం ప్రాంతీయంగా సమృద్ధంగా ఉన్నప్పటికీ, మౌర్య యుగంతో పోలిస్తే అఖిల భారత స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ఈ విషయాన్ని చరిత్రకారుడు కె.ఎ. నీలకంఠ శాస్త్రి గుర్తించారు.

ముగింపు:
శాతవాహనుల వారసత్వం దక్షిణ భారతదేశంలో సామాజిక-సాంస్కృతిక మరియు ఆర్థిక రంగాలను ఇప్పటికీ ప్రభావితం చేస్తూనే ఉంది. అమరావతి స్తూపం మరియు నాగార్జునకొండ శిథిలాలు వారి కళాత్మక ఆశ్రయానికి శాశ్వత చిహ్నాలుగా నిలిచాయి. వారి సుసంఘటిత శ్రేణీ (సంఘ) వ్యవస్థ, ఆధునిక వాణిజ్య సంఘాలు, వ్యాపార గిల్డ్‌లు మరియు వాణిజ్య మండళ్లకు పునాది వేసింది. ఈ వ్యవస్థలు నేటికీ భారతదేశంలో ఆర్థిక కార్యకలాపాలను మార్గనిర్దేశం చేస్తూ, సమర్థవంతంగా కొనసాగుతున్నాయి.