TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES

Thu Apr 24, 2025

Q. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం యొక్క ప్రభావాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించండి.

పరిచయం:
1942 ఆగస్టులో, రెండవ ప్రపంచ యుద్ధ సంక్షోభం మరియు రాజకీయ ప్రతిష్టంభనల మధ్య, భారత జాతీయ కాంగ్రెస్ “క్విట్ ఇండియా” ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ “DO OR DIE” అనే నినాదంతో — బ్రిటిష్‌ వారు తక్షణమే భారత్‌ను వదిలి వెళ్ళాలని డిమాండ్‌ చేశారు. ఈ ఉద్యమాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రమైన హింసతో అణిచివేసినప్పటికీ దీని ప్రభావం రాజకీయ, సామాజిక, అంతర్జాతీయ రంగాలలో పరిమితులు దాటి వ్యాపించింది.

విషయం:
క్విట్ ఇండియా ఉద్యమ ప్రభావాలు:
1. రాజకీయ ప్రభావం
a. ఈ ఉద్యమం బ్రిటిష్ పాలనను నైతికంగా, రాజకీయంగా ఎంతగానో దెబ్బతీసింది.
b. సమ్మెలు, నిరసనలు, విధ్వంసకర చర్యల వల్ల వలస పరిపాలనకు తీవ్ర అంతరాయం కలిగింది.
c. మహారాష్ట్రలోని సతారా, ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా వంటి ప్రాంతాల్లో ఏర్పడిన సమాంతర ప్రభుత్వాలు ప్రజల్లో సామ్రాజ్యవాద ప్రభుత్వం పట్ల గల అసంతృప్తిని తెలియజేశాయి.
2. బ్రిటిష్‌ వారిపై మానసిక, నైతిక ఒత్తిడి
a. ప్రజలు ఈ ఉద్యమంలో విస్తృత స్థాయిలో పాల్గొనడం అనేది బ్రిటిష్ అధికారులను మానసికంగా కలచివేయడమే కాకుండా, వారి ధైర్యాన్ని దెబ్బతీసింది.
b. అనేక మంది బ్రిటిష్ అధికారులు భారత ప్రజల సమ్మతితో తప్ప అంతర్గతంగా పాలన సాధ్యం కాదన్న విషయాన్ని అంగీకరించారు.
3. సామాజిక మరియు జాతీయ ప్రభావం
a. యువత, మహిళలు, కూలీలు, రైతుల భాగస్వామ్యంతో ఉద్యమం సమాజంలోని అన్ని వర్గాలను ఆకర్షించింది.
b. ముస్లిం లీగ్ మరియు కమ్యూనిస్టుల మద్దతు లేకపోయినప్పటికీ, దేశ ప్రజల చైతన్యంతో జాతీయ ఐక్యతను ఇది మరింతగా బలపరిచింది.
4. అంతర్జాతీయ ప్రభావం
a. బ్రిటిష్ వలస పాలకుల నిరంకుశ పాలనకు అమెరికా, చైనా వంటి దేశాల నుండి విమర్శలు వెల్లువెత్తాయి.
b. ప్రజాస్వామ్య పరిరక్షణకై బ్రిటన్ తీసుకున్న నైతిక బాధ్యతకు ఇది కఠిన సమస్యగా మారింది.
5. వ్యూహాత్మక మరియు దీర్ఘకాలిక ప్రభావం
a. ఈ ఉద్యమం వలస ప్రభుత్వంపై తీవ్రమైన రాజకీయ ఒత్తిడిని కలిగించింది.
b. యుద్ధానంతర చర్చలకు, కేబినెట్ మిషన్ ప్లాన్ వంటి ప్రక్రియలకు ఈ ఉద్యమం పునాది వేయడమేగాక, తద్వారా దేశ స్వాతంత్ర్యానికి దారి తీసింది.
ఉద్యమ పరిమితులు
1. ప్రధాన నాయకులను జైలు పాలు చేయడంతో వివిధ వర్గాల మధ్య సమన్వయం ఆశించిన స్థాయిలో సాధ్యపడలేదు.
2. మతసామరస్యత లేని కారణంగా ముస్లిం లీగ్ మరియు స్థానిక సంస్థానాల మద్దతు లభించలేదు.
3. కమ్యూనిస్టుల వ్యతిరేకతతో దేశ ప్రజల ఐక్యత బలహీనపడింది.
4. బ్రిటిష్ వారు ఈ ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేయడం వలన దీర్ఘకాలికంగా ప్రజా గళం నిలబడలేకపోయింది.
5. ఈ ఉద్యమం ద్వారా బ్రిటిష్ వారి నుంచి తక్షణ ఫలితాలు ఏవీ లభించలేదు.

ముగింపు
క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ పాలకుల అసమర్ధతను బయటపెడుతూ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ప్రజల ఆవేదనను ఒక సమిష్టి జాతీయ డిమాండ్‌గా మార్చిన ఈ ఉద్యమం, 1947లో స్వాతంత్య్ర సాధనకు దారిచూపింది.

Additional Embellishment: