TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES

Thu Apr 10, 2025

Q: భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణలో సైన్య సహకార ఒప్పంద వ్యవస్థ (Subsidiary Alliance) యొక్క పాత్రను విమర్శనాత్మకంగా వివరించండి?

పరిచయం: 
1798లో లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార ఒప్పంద వ్యవస్థ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రాజకీయ మరియు సైనిక ఆధిపత్యాన్ని స్థాపించడంలో ఒక వ్యూహాత్మక సాధనంగా పనిచేసింది. ఈ వ్యవస్థ ఒక వైపు బ్రిటిషు సామ్రాజ్యవాదాన్ని బలోపేతం చేస్తూనే మరోవైపు భారతీయ రాజ్యాల విచ్చిన్నానికి కారణమయింది.

విషయం:
భారతదేశంలో బ్రిటిష్ నియంత్రణ బలపడటంలో సైన్య సహాకార విధానం యొక్క పాత్ర
1) సైనిక నియంత్రణ:
· ఈ ఒప్పందం ద్వారా బ్రిటిష్ వారు భారతీయ రాజ్యాలపై ప్రత్యక్ష సైనిక ఆధిపత్యం మరియు నియంత్రణను సాధించారు. ఉదాహరణకు, హైదరాబాద్ (1798), మైసూర్, అవధ్, మరియు మరాఠా వంటి శక్తివంతమైన రాజ్యాలు ఈ వ్యవస్థలో భాగం అయ్యాయి.
2) ఆర్థిక దోపిడీ:
· సైనిక ఖర్చును భరించడం భారతీయ రాజ్యాలకు ఆర్థిక భారంగా మారింది. ఈ ఖర్చులను చెల్లించలేని పక్షంలో, స్వదేశీ రాజ్యాలు తమ భూభాగాలను బ్రిటిష్ వారికి ధారాదత్తం చేయాల్సి వచ్చేది, దీని ఫలితంగా వారి రాజ్యాలు క్రమంగా కుంచించుకుపోయాయి.
· ఉదా: హైదరాబాద్ నిజాం 1800లో బ్రిటీష్ సైనికుల ఖర్చులను చెల్లించలేకపోవడంతో, తన ఆధీనంలోని కొంత భూభాగాన్ని బ్రిటిషు వారికి అప్పగించాల్సి వచ్చింది.
3) విదేశాంగ వ్యవహారాలపై ఆంక్షలు:
· సైన్య సహకార సంధికి అంగీకరించిన స్వదేశీ రాజ్యాధినేత తన విదేశీ వ్యవహారాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ సార్వభౌమాధికారాన్ని తప్పకుండా అంగీకరించిరావాల్సింది కాబట్టి కంపెనీ అనుమతి లేనిదే యుద్ధాలు, ఒడంబడికలకు తావు లేకుండా పోయింది. దానితో స్వదేశీ రాజ్యాల రాజకీయ స్వతంత్రత చాలా వరకూ పరిమితమయ్యింది.
· ఉదా: హైదరాబాద్ నిజాం వంటి వారు వాళ్ళ ప్రమేయం లేని యుద్ధాలలో బ్రిటిషు వారితో కలిసి పాల్గొనాల్సి వచ్చింది.
4) బ్రిటిషు సామ్రాజ్య విస్తరణ:
· బ్రిటిషు వారు ప్రత్యక్ష తగాదాలు లేకుండానే భారతీయ రాజ్యాలను ఆక్రమించగలిగారు.
· ఉదా: మైసూరు, అవధ్ మరియు మరాఠా రాజ్యాల పాలకులను మొదటగా ఆకర్షించి తరువాత ఈ ప్రాంతాలను బ్రిటిషు సామ్రాజ్యంలో భాగం చేసారు.
5) స్వదేశీ రాజ్య అంతర్గత వ్యవహారాల్లో జోక్యం:
· సైన్య సహకార విధానం భారతీయ రాజుల స్వతంత్రతను హరిస్తూ వారిని కీలుబొమ్మలుగా మార్చింది. స్వదేశీ రాజ్య ఆస్థానాలలో నియమించబడిన బ్రిటీష్ రెసిడెంట్లు పాలనలో ఎప్పటికప్పుడు జోక్యం చేసుకుంటూ, బ్రిటిష్ ప్రయోజనాల కోసమే పని చేసేవారు.
· సైన్య సహకార విధానం యొక్క లోపాలు మరియు పరిణామాలు
1) దోపిడీ స్వభావం:
· ఈ విధానం భారతీయ రాజ్యాలు బ్రిటిషు వారిపై శాశ్వతంగా ఆధారపడేలా చేయడంతో పాటు వారు ఆర్థికంగా దివాళా తీసేలా చేసింది. పాలకులు బ్రిటిషు సైనిక పోషణ కోసం వాళ్ళ ఆధీనంలోనున్న భూభాగాన్ని అప్పగించడం లేక పెద్ద మొత్తాన్ని చెల్లించాల్సి రావడంతో వారి రాజకీయ శక్తి తీవ్రంగా దెబ్బతింది.
2) సార్వభౌమాధికారం కోల్పోవడం:
· భారతీయ పాలకులు సైనిక స్వాతంత్రాన్ని మరియు తమ రాజ్యాలను రక్షించుకునే సామర్థ్యాన్ని కోల్పోయారు.
· ఉదాహరణ: హైదరాబాద్, మైసూర్, తంజావూర్, అవధ్ మరియు తరువాత మరాఠా రాజ్యాలు (పేష్వా, సింధియా, భోంస్లే, గైక్వాడ్) ఈ సంధిపై సంతకం చేసి, స్వతంత్ర సైనిక మరియు విదేశాంగ అధికారాలను కోల్పోయాయి.
3) పరిమిత ప్రభావం:
· కొన్ని రాజ్యాలలో ఈ విధానం తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవడాన్ని కూడా గమనించవచ్చు.
· ఉదాహరణ: మైసూర్‌కు చెందిన టిప్పు సుల్తాన్ నాల్గవ ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో సైన్య సహకార విధానాన్ని వ్యతిరేకించడంతో ఈ విధానం అన్ని వేళలా ప్రభావవంతం కాదని రుజువు అయింది.
4) ఆర్థిక ఒత్తిడి
· బ్రిటిష్ సైన్యాల నిర్వహణ భారం వల్ల అనేక భారతీయ రాజ్యాలు కుప్పకూలాయి.
· ఉదాహరణ: అవధ్ నవాబ్‌లు తీవ్ర ఆర్థిక అస్థిరతను ఎదుర్కొన్నారు. చివరకు ఈ ఆర్ధిక భారం 1856లో బ్రిటిష్ వారి అవధ్ ఆక్రమణకు దారితీసింది.
5) అసంతృప్తి మరియు తిరుగుబాట్లు
· ఈ విధానం భారతీయ పాలకులలో మరియు ప్రజలలో తీవ్రమైన అసంతృప్తిని రేకెత్తించింది. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు మొదలవడానికి గల ముఖ్యమైన కారణాల్లో ఈ సైన్య సహకార విధానం ఒకటి గా చెప్పవచ్చు.

ముగింపు
"వెల్లెస్లీ ప్రవేశ పెట్టిన ఈ విధానం భారతీయ పాలకుల సార్వభౌమాధికారాన్ని నాశనం చేసి, బ్రిటిష్ ఆధిపత్యానికి మార్గం సుగమం చేసింది." అంతేకాకుండా ఈ విధానం బ్రిటిష్ వారికి భారతదేశం అంతటా తమ నియంత్రణను విస్తరించే అవకాశం కల్పించి, భారతీయ రాజ్యాల రాజకీయ శక్తిని నిర్వీర్యం చేసింది. ప్రారంభంలో విజయవంతం అయినప్పటికీ, తరువాత కాలం లో తీవ్ర ప్రతిఘటనను రేకెత్తించి, 1857 భారత తిరుగుబాటు మొదలవడంలో కీలక పాత్ర పోషించింది.