TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES

Sun Apr 20, 2025

Q. "వయస్సు, కుల, మత మరియు వర్గ భేదాలను అధిగమిస్తూ, భారత స్వాతంత్య్ర పోరాటం లో భారత మహిళలు కీలక పాత్ర పోషించారు." చర్చించండి.

పరిచయం:
భారత స్వాతంత్య్ర సమరంలో స్త్రీలు కీలక పాత్ర పోషించారు. రాణి లక్ష్మీబాయి వంటి నాయకులు ప్రథమ స్వాతంత్ర తిరుగుబాటులో పాల్గొనగా, అరుణా అసఫ్ అలీ వంటి వారు క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు. మహాత్మా గాంధీ చెప్పినట్లుగా, వయస్సు, మత బేధాలకు అతీతంగా మహిళలు చేసిన త్యాగాలు భారత స్వాతంత్య్ర సంగ్రామానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.

విషయం:
భారత స్వాతంత్య్ర సమరంలో స్త్రీల పాత్ర జాతీయ ఉద్యమంలో సాంప్రదాయ సంకెళ్లను సవాలు చేసిన స్త్రీలు:
1. తొలి నాటి ఆయుధ పోరాటం
a) 1857లో, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి స్త్రీలు ఆయుధ సమరంలో పాల్గొనడంలో స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
b) అవధ్ రీజెంట్‌గా వ్యవహరించిన బేగం హజ్రత్ మహల్, లక్నోలో తిరుగుబాటును నడిపించారు. ఆమె సైనికులను సంఘటితం చేసి, మొదటి స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్ ఆధిపత్యాన్ని ఎదిరించారు.
2. సామూహిక ఉద్యమాల్లో పాల్గొనడం
a) 1930లో ఉప్పు సత్యాగ్రహంలో, సరోజినీ నాయుడు, కమలాదేవి చట్టోపాధ్యాయ, రుక్మిణీ లక్ష్మీపతి వంటి మహిళా నాయకులు నిరసన కార్యక్రమాలను చేపడుతూ, బ్రిటీషు చట్టాలను సవాలు చేశారు.
b) 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా, అరుణా అసఫ్ అలీ గోవాలియా ట్యాంక్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 22 ఏళ్ల ఉషా మెహతా, బ్రిటిష్ సెన్సార్‌షిప్‌ను ఎదుర్కొంటూ సీక్రెట్ కాంగ్రెస్ రేడియోను సమర్ధవంతంగా నిర్వహించారు.
3. విప్లవాత్మక కార్యకలాపాల్లో భాగస్వామ్యం
a) ప్రీతిలతా వడ్డేదార్ చిట్టగాంగ్‌లోని యూరోపియన్ క్లబ్‌పై దాడి చేసి, తన జీవితాన్ని ఈ దేశం కోసం త్యాగం చేశారు.
b) కల్పనా దత్, సూర్య సేన్ నాయకత్వంలో చిట్టగాంగ్ ఆయుధశాలపై జరిపిన దాడిలో పాల్గొన్నారు.
c) మేడమ్ భీఖాజీ కామా విదేశాలలో ప్రారంభ విప్లవ ఉద్యమానికి నాంది పలికారు. 1907లో, స్టట్‌గార్ట్‌లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ కాంగ్రెస్‌లో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి, యూరోప్‌లో తన రచనల ద్వారా జాతీయవాద భావనలను ప్రచారం చేశారు.
4. వివిధ వర్గాల భాగస్వామ్యం
a) కస్తూర్బా గాంధీ, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, మహాత్మా గాంధీతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొని, జైలు శిక్షను సైతం అనుభవించారు.
b) ఉషా మెహతా వంటి యువతులు మరియు అనేక విద్యార్థి స్వచ్ఛంద సేవకులు రహస్యంగా పనిచేస్తూ, సమాచార వ్యవస్థల సాయంతో, పోరాట కార్యకలాపాలను చేపట్టారు.
5. రాజకీయ ప్రాతినిధ్యం
a) సరోజినీ నాయుడు 1925లో భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలిగా సేవలందించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు.
b) కమలా నెహ్రూ స్థానికంగా స్త్రీలను సమీకరించి, ముఖ్యంగా బ్రిటీషువారి కఠినమైన పన్ను విధానాలను వ్యతిరేకించారు.
సామాజిక ఐక్యత మరియు సామాజిక సంస్కరణలలో మహిళల పాత్ర
1. మత సామరస్యతను ప్రోత్సహించడం
a) సరోజినీ నాయుడు (హిందూ), బేగం రోకియా (ముస్లిం సంస్కర్త), మరియు అన్నీ బెసెంట్ (క్రైస్తవురాలు) వంటి నాయకులు స్వాతంత్య్ర ఉద్యమం యొక్క సమగ్ర మరియు వైవిధ్యమైన స్వభావానికి సాక్ష్యం గా నిలిచారు.
b) భారత జాతీయ సైన్యం (INA) యొక్క మహిళా విభాగంలో హిందూ, ముస్లిం, సిక్కు, మరియు క్రైస్తవ సముదాయాల సభ్యులు ఉన్నారు.
c) ముస్లిం స్త్రీ అయిన బేగం హజ్రత్ మహల్, బ్రిటిష్ పాలనను ఎదిరించడానికి విభిన్న మత నేపథ్యాల నాయకులతో కలిసి పనిచేశారు. ఆమె చర్యలు జాతీయ ఉద్యమంలో హిందూ మరియు ముస్లిం వర్గాల మధ్య ఐక్యతకు చిహ్నంగా పేర్కొనవచ్చు.
2. మహిళా సంస్థల స్థాపన
a) 1910లో, సరళా దేవి భారత మహిళా మహా మండలిని స్థాపించి, మహిళల విద్య మరియు హక్కులను ప్రోత్సహించారు.
b) 1917లో, అన్నీ బెసెంట్ మహిళల హక్కులు మరియు అభ్యున్నతికై విమెన్స్ ఇండియన్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేయడంలో సహాయపడ్డారు.
c) 1927లో స్థాపితమైన అఖిల భారత మహిళా సమావేశం, మహిళల విద్య, ఓటు హక్కు, మరియు బాల్య వివాహాలను నిరోధించే సర్దా చట్టం వంటి చట్టపరమైన సంస్కరణలపై దృష్టి సారించింది.
3. విద్య మరియు సామాజిక మార్పుల కోసం కృషి
a) పండిత రమాబాయి, రమాబాయి రానడే, మరియు ధోండో కేశవ కర్వే వంటి సంస్కర్తలు మహిళల విద్యను మెరుగుపరచడానికి మరియు వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించేందుకు ఎంతగానో కృషి చేశారు.
b) ఎస్‌ఎన్‌డీటీ మహిళా విశ్వవిద్యాలయం వంటి సంస్థలు మరియు స్త్రీ దర్పణ్ వంటి పత్రికలు మహిళలలో రాజకీయ మరియు సామాజిక చైతన్యాన్ని పెంపొందించాయి.
4. దేశీయ వస్తు వినియోగానికి ప్రోత్సాహం
a) మహిళలు విదేశీ వస్తువులను తిరస్కరించడం ద్వారా స్వదేశీ ఉద్యమాన్ని ముందుండి నడిపారు.
b) అంతేకాకుండా వారి ఆభరణాలు మరియు విలువైన వస్తువులను భారత జాతీయోద్యమానికై దానం చేసారు.
c) స్వదేశీ సూత్రాల ఆధారంగా మహిళలు పాఠశాలలు మరియు చేనేత కేంద్రాలను స్థాపించి, స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించారు.
5. రాజకీయ మరియు చట్టపరమైన హక్కులకై కృషి
a) మహిళా నాయకులు సమాన ఓటు హక్కులను, అలాగే వివాహం, ఆస్తి, మరియు విద్యకు సంబంధించిన సంస్కరణలను డిమాండ్ చేశారు.
b) సరోజినీ నాయుడు మహిళల ఓటు హక్కు కోసం కృషి చేసి, అంతర్జాతీయ సమావేశాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.
c) ముత్తులక్ష్మీ రెడ్డి దేవదాసీ వ్యవస్థను రద్దు చేయడానికి కృషి చేసి, మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే చట్టాలను డిమాండ్ చేసారు.
d) హన్సా మెహతా సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన రూపొందించడంలో సహాయపడి, భారతదేశంలో సమాన పౌర హక్కులకై ఎంతగానో పాటు పడ్డారు.
e) 1930 మరియు 1940 దశకాల్లో అఖిల భారత మహిళా సమాఖ్య మహిళలకు చట్టపరమైన మరియు రాజ్యాంగ సమానత్వం కోసం ప్రచారం చేసింది.

ముగింపు
భారతీయ స్త్రీలు అనాదిగా బిగుసుకున్న సామాజిక సంకెళ్లను తెంచుకుని, స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. రాజకీయ కార్యకలాపాల్లో భాగమవడం ద్వారా, జాతీయోద్యమాన్ని ముందుండి నడిపించడమే కాకుండా, మహిళల హక్కులకు సంబంధించిన భవిష్యత్ సంస్కరణలకు బలమైన పునాదిని వేశారు. వారి కృషి, మహిళా రిజర్వేషన్ బిల్లు, బేటీ బచావో బేటీ పఢావో, మరియు మిషన్ శక్తి వంటి ప్రస్తుత కార్యక్రమాలపై కూడా ఎంతగానో ప్రభావం చూపుతోంది.

Additional Embellishment: