TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES

Tue Apr 8, 2025

Q. భారతీయ వాస్తుశిల్ప అభివృద్ధికై మొఘలులు చేసిన కృషిని వివరించండి.

పరిచయం:
      ప్రముఖ చరిత్రకారుడు ఆర్. నాథ్ వ్యాఖ్యానించినట్లుగా, “మొఘల్ వాస్తుశిల్పం అనేది ఇండో-ఇస్లామిక్ వాస్తుశిల్ప సంప్రదాయానికి కొనసాగింపుగా మొదలయ్యి, మొఘల్ చక్రవర్తుల సామ్రాజ్యవాద పటిమ మరియు వారి ఆదరణతో తరువాత కాలం లో ఉన్నత శిఖరాలకు చేరుకుంది. 16వ శతాబ్దంలో ఓ గొప్ప సామ్రాజ్య నిర్మాతలుగా ఎదిగిన మొఘలులు, పెర్షియన్, మధ్య ఆసియా మరియు దేశీయ శైలుల కలయికతో ఓ ప్రత్యేకమైన శైలికి పునాది వేశారు.

విషయం:
   
1
. అద్భుత స్మారక నిర్మాణాలు
           A. హుమాయూన్ సమాధి:
               భారతదేశంలో మొఘల్ శైలిలో భారీ సమాధుల నిర్మాణం హుమాయూన్ సమాధితో మొదలయింది. పెర్షియన్ శైలిలోని చార్ బాగ్ రకపు ఉద్యానవనాన్ని కలిగి ఉండడం దీని ప్రత్యేకత. తైమూర్ సమాధికి అనుకరణగా రెండు గుమ్మటాలతో (అంతర్గతంగా, బహిర్గతంగా) ఎంతో అందంగా తీర్చిదిద్దబడిన ఈ కట్టడం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తింపబడింది.
            B. తాజ్ మహల్:
                షాజహాన్ ఆదేశానుసారంగా నిర్మించబడిన తాజ్ మహల్, మొఘల్ సమాధి నిర్మాణ శైలిని ఉన్నత స్థాయికి చేర్చింది. తెల్లని చలువరాయితో నిర్మితమైన ఈ అద్భుత నిర్మాణం, సంపూర్ణ సమతుల్యత, ద్విగుమ్మటాలు, జాలి పనితీరు, మరియు ఎంతో అందమైన పీత్రదురా (pietra dura) అలంకరణలతో ప్రఖ్యాతి గాంచింది. ఇది కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపబడింది.
   
2
. భారీ కోటల నిర్మాణం
            A. అగ్రా కోట & ఫతేపూర్ సిక్రీ:
                అక్బర్ కాలంలో నిర్మించబడిన ఈ కోటలు, సైనిక అవసరాలను తీర్చడమే కాకుండా, ఎంతో కళాత్మక వైభవంతో దర్శనమిస్తాయి. ఎర్ర రాతితో నిర్మించిన ఈ కోటలు, జరోఖాలు (బాల్కనీలు), ఇండో-ఇస్లామిక్ శిల్ప శైలుల మేళవింపుతో నిర్మించబడడం కారణంగా చరిత్రకారులు ఈ కాలం నాటి ఇండో ఇస్లామిక్ వాస్తుశైలిని “Frozen Moment in History” గా అభివర్ణిస్తారు.

            B. ఎర్రకోట (ఢిల్లీ):
                   షాజహాన్ నిర్మించిన ఎర్రకోట, మొఘలుల సామ్రాజ్యవాద శక్తికీ, వారి వైభవోపేతమైన జీవనశైలికీ ఒక ప్రతీక. దీనిలోని ఇతర నిర్మాణాలైన దివాన్-ఇ-ఆమ్, దివాన్-ఇ-ఖాస్, సమతుల్య ప్రణాళిక, ఎర్ర ఇసుకరాయి గోడలకు మధ్యలో పొదగబడిన నీలి రంగు రాళ్లు, మరియు అందంగా లిఖించబడిన (కాలిగ్రఫీ) పర్శియన్ సూక్తులు మొఘల్ సామ్రాజ్య వైభవాన్ని చాటి చెప్తాయి. ఈ కోట కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది.
   
3
. మతపరమైన కట్టడాలు:
              
A. అక్బర్ నిర్మించిన జామా మసీదు మరియు ఇబాదత్ ఖానా వంటి మతపరమైన భవనాలు స్వదేశీ నిర్మాణ శైలిలో కనిపిస్తాయి. ఇవి అతని మత సహన మరియు సమ్మిళిత దృక్పథానికి అద్దం పడతాయి.
             B. షాజహాన్ కాలంలో నిర్మించబడిన జామా మసీదు (ఢిల్లీ) “The Glory of Fatehpur” గా పేరు పొందింది. ఎర్రని ఇసుకరాయి మరియు పాలరాయిని ఉపయోగించి ఎంతో దృఢంగా మరియు సుందరంగా తీర్చిదిద్దారు.
             C. ఔరంగాజేబు నిర్మించిన బాద్షాహి మసీదు (లాహోర్) కూడా మొఘలుల కాలం నాటి అద్భుతమైన మతపరమైన కట్టడం. అయితే ఇది అతని మౌలిక, సంప్రదాయవాద ఆలోచనలకు అనుగుణంగా నిర్మింపబడింది.
     
4
. ఉద్యానవనాలు
               A. బాబర్ చార్ బాగ్ రకపు ఉద్యానవన శైలిని ప్రవేశపెట్టాడు. దీనిని తరువాత అతని వారసులు అభివృద్ధి చేశారు. పారశీక శైలిలో స్వర్గ ద్వారాన్ని సూచించేవిధంగా ఉండే చార్ బాగ్ రకపు ఉద్యానవనాల నిర్మాణం మొఘల్ వాస్తు నిర్మాణ శైలిలో అంతర్భాగంగా మారింది.
               B. జహంగీర్ కాశ్మీర్ లో నిర్మించిన షాలిమార్ బాగ్ ఎంతో అందమైన నిర్మాణం. సహజ ప్రకృతి సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తూ ఉద్యానవనాల రూపకల్పన చేయడం మొఘల్ రాజులకు ప్రకృతి పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తుంది.
       
5
. అలంకార పద్ధతులు
               జహంగీర్ మరియు షాజహాన్ కాలంలో, మొఘల్ అలంకార శైలి పీత్ర దురా (పాలరాతి గోడలపై తీగలు, పుష్పాలతో కూడిన డిజైన్లపై అత్యంత పాలిష్ చేసిన రాళ్లను పొడగడం మరియు తాపడం చేయడం), జాలి పనితీరు వాడకం, అందమైన పర్శియన్ సూక్తులు లిఖించడం (కాలిగ్రఫీ) మరియు రేఖాగణిత అలంకారాలతో ఉన్నత స్థానానికి చేరుకుంది. మొఘలులు కళాత్మకత మరియు ఖచ్చితత్వాలకు ఇచ్చిన సమప్రాధాన్యతకు ఇది అద్దం పడుతుంది..

ముగింపు:
           సామ్రాజ్యవాదాన్ని కళాత్మకత తో కలగలిపి మొఘలులు భారత వాస్తు నిర్మాణ శైలికి కొత్త రూపాన్ని ఇచ్చారు. తాజ్ మహల్, ఎర్రకోట వంటి ఎన్నో స్మారక చిహ్నాల నిర్మాణంతో భారత సంస్కృతి మరియు చరిత్రపై వీరు చెరగని ముద్ర వేయడమే కాక, ఆధునిక వాస్తు శిల్పశైలిని కూడా గణనీయంగా ప్రభావితం చేసారు.