There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Sun Apr 20, 2025
పరిచయం:
భారత దేశ చరిత్రలోనే కీలక ఘట్టమైన 1857 సిపాయిల తిరుగుబాటును భారతీయ చరిత్రకారులు ప్రథమ భారత స్వాతంత్య్ర సమరంగా పేర్కొన్నారు. ఈ తిరుగుబాటు వల్ల బ్రిటీషు కంపెనీ పునాది కూకటివేళ్లతో సహా కదిలించబడటమే గాక బ్రిటిష్ పాలనపై ప్రజల్లో పేరుకుపోయిన తీవ్రమైన అసంతృప్తిని బహిర్గతం చేస్తూ వారి పాలనా విధానాలలో సమూలమైన మార్పులు తీసుకురావడంలో కీలకమైన పాత్ర పోషించింది.
విషయం:
1857 తిరుగుబాటు యొక్క ప్రభావం
1. కంపెనీ పాలన రద్దు మరియు బ్రిటీషు ప్రభుత్వ ప్రత్యక్ష పాలన ప్రారంభం:
-బ్రిటిష్ పార్లమెంటు 1858లో భారత ప్రభుత్వ చట్టాన్ని చేయడంతో, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసింది. తద్వారా భారతదేశంపై బ్రిటీషు ప్రభుత్వ ప్రత్యక్ష పాలన ప్రారంభమయింది.
2. పాలనా నిర్మాణంలో మార్పులు:
-చట్టం ప్రకారం గవర్నర్-జనరల్ అనే పదవిని వైస్రాయ్‌గా (రాజా ప్రతినిధి) గా మార్చారు. భారత రాజ్య కార్యదర్శి (సెక్రటరీ స్టేట్ ఫర్ ఇండియా) అనే నూతన పదవి ఏర్పాటు చేయబడింది. దీనితో మరింత కేంద్రీకృత సామ్రాజ్య పాలన ప్రారంభమయింది.
3. హిందూ-ముస్లిం ఐక్యత:
-ఈ తిరుగుబాటు భారత దేశంలో అసాధారణ సామాజిక ఐక్యతకు సాక్ష్యంగా నిలిచింది. హిందువులు మరియు ముస్లింలు కలిసి తిరుగుబాటును నడిపించడమేగాక ఒకరి మతపరమైన భావనలను మరొకరు గౌరవించారు. ఈ ఐక్యత భారతీయ జాతీయవాదానికి తొలి పునాదిగా మారింది. అంతేకాకుండా తరువాతి భారత జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించింది.
4. బ్రిటిష్ అధికార తిరస్కరణ:
-తిరుగుబాటు దారులు బ్రిటీషు సంస్థలను మరియు విధానాలను తిరస్కరిస్తూ భూమి రికార్డులను ధ్వంసం చేశారు. అంతేకాకుండా రెవెన్యూ కలెక్టర్లను మరియు వడ్డీ వ్యాపారులనూ వ్యతిరేకించారు. దానితో విదేశీ పాలనపైనే కాకుండా ఆర్థిక దోపిడీని కూడా సవాలు చేయగలిగారు.
5. రాజకీయ చైతన్యం మరియు జాతీయవాద భావన:
-విభిన్న సమూహాలను ఏకం చేయడం ద్వారా ఈ తిరుగుబాటు జాతీయవాద బీజాలను నాటింది. ఈ సంగ్రామం పూర్తిస్థాయి జాతీయవాద ఉద్యమం కాకపోయినప్పటికీ, భవిష్యత్ పోరాటాలకు సైద్ధాంతిక పునాదిగా మారింది.
బ్రిటిష్ విధానాలు మరియు పాలనలో ప్రధాన మార్పులు
1. పరిపాలనా పునర్వ్యవస్థీకరణ:
-లండన్ నుండి భారత వ్యవహారాలను పర్యవేక్షించడానికి భారత రాజ్య కార్యదర్శి (సెక్రటరీ స్టేట్ ఫర్ ఇండియా) అనే నూతన పదవి సృష్టించబడింది. పాలనా వ్యవహారాల్లో అతనికి సహాయం అందించేందుకై ఇండియన్ కౌన్సిల్ ఏర్పాటు కాబడింది. అంతేకాకుండా భారతదేశంలో వైస్రాయ్ మునుపటి కంటే మరింత కఠిన నియంత్రణతో పాలన సాగించాడు.
2. సైనిక సంస్కరణలు:
-బ్రిటిష్ వారు యూరోపియన్ సైనికుల సంఖ్యను పెంచడమే గాక వ్యూహాత్మక ప్రాంతాలను వారికే పరిమితం చేశారు. అంతేకాకుండా తిరుగుబాటు కాలం లో సహకరించిన సిక్కు (పంజాబ్), నేపాల్ (గూర్ఖ), వాయువ్య సరిహద్దు (పఠాన్స్) పోరాట తెగలను సైన్యంలో చేర్చుకున్నారు.
3. స్వదేశీ రాజ్యాల పట్ల నూతన విధానం:
-రాజ్య సంక్రమణ సిద్ధాంతం రద్దు చేయబడింది. బ్రిటిషు సార్వభౌమాధికారాన్ని అంగీకరించిన స్వదేశీ పాలకులకు వారి అంతర్గత పాలన మరియు వారసులను ఎన్నుకునే హక్కులు ఇవ్వబడ్డాయి. దీనితో సామ్రాజ్య విస్తరణ, ఆక్రమణలు ముగిసాయి.
4. సామాజిక మరియు విద్యా విధానంలో మార్పు:
-భారతీయ భావనలను, ఆచారాలను గాయపరచకుండా ఉండేందుకై బ్రిటిష్ వారు సామాజిక సంస్కరణల నుండి దూరంగా ఉన్నారు. అంతేగాక ఆంగ్ల విద్యను అభ్యసించే భారతీయులపై ఆంగ్లేయులు అపనమ్మకం చూపించడం మొదలైంది.
5. సాంప్రదాయవాదులతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం:
-బ్రిటిష్ వారు జమీందారులు మరియు సాంప్రదాయ ఉన్నతవర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసారు. వారి ప్రత్యేక హక్కులకు మద్దతునిస్తూ వారికి అనుకూలంగా ఉండే విధంగా ఓ విశ్వాసపాత్రమైన ఉన్నత వర్గాన్ని నిర్మించుకున్నారు.
6. విభజించి పాలించు విధానం:
-సామాజిక మరియు ప్రాంతీయ విభజనలకు నాంది పలికారు. మొదట ముస్లింల పట్ల కఠిన వైఖరిని అవలంబించిన బ్రిటిష్ వారు, తరువాత కాలంలో హిందూ జాతీయవాద వ్యాప్తిని అడ్డుకోవడానికై ముస్లింలకు మద్దతుగా నిలిచారు.
ముగింపు:
1857 తిరుగుబాటు వలస పాలనకు వ్యతిరేకంగా భారతీయులలో చైతన్యాన్ని రగిలించడమేగాక భారత ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తూ, ఆధునిక జాతీయవాదానికి పునాది వేసింది. బ్రిటిష్ పాలనను పూర్తిగా అంతం చేయడంలో విఫలమైనప్పటికీ, వారి సామ్రాజ్యవాద పోకడలను బయటపెడుతూ భారత జాతీయోద్యమానికి ప్రేరణగా నిలిచింది.
Additional Embellishment: