TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES

Mon May 5, 2025

Q."తెలంగాణలో జైనమతం తొలినాళ్లలో ఆదరణకు నోచుకున్నప్పటికీ, క్రమంగా తన ప్రాముఖ్యతను కోల్పోయింది." పై ప్రకటనకు అనుగుణంగా జైన మత క్షీణతకు కారణమైన అంశాలను చర్చించండి.

పరిచయం:
తెలంగాణలో జైనమతం ప్రాచీన కాలంలో ఏంతో ప్రాముఖ్యతను కలిగి ఉండేది. అంతేగాక పదవ తీర్థంకరుడైన శీతలనాథుడు ఈ ప్రాంతంలోని భద్రాచలం (ప్రస్తుత భద్రాద్రి కోత్తగూడెం జిల్లా) లో జన్మించారని విశ్వాసం. మొదట జైనమతం ఉజ్జ్వలంగా విస్తరించినా, అనంతర కాలంలో రాజకీయ, మతపరమైన మార్పులు, ఆర్థిక పరిస్థితుల కారణాలతో దీని ప్రభావం తగ్గిపోయింది.

విషయం:
తెలంగాణలో జైనమతం పతనానికి కారణమైన ప్రధాన అంశాలు
:
1. వైదికమతం వైపుగా రాజపోషణ మారడం:
-
ప్రారంభ శాతవాహనులు జైనమతానికి ఆశ్రయం ఇచ్చారు. కోటి లింగాల సమీపంలోని మునులగుట్ట వద్ద లభించిన శిలా అవశేషాలు దీనికి నిదర్శనంగా ఉన్నాయి. కానీ ఈ వంశానికే చెందిన గౌతమిపుత్ర శాతకర్ణి బ్రాహ్మణ ధర్మాన్ని పునరుజ్జీవించేందుకు అనేక కృషి చేశాడు. నాసిక్ శాసనం ఆయనను "ఏకబ్రాహ్మణ"గా సంబోధించడం ఆయన వేదధర్మాన్ని, కులమర్యాదలను రక్షించేందుకు చేసిన కృషిని సూచిస్తుంది. ఈ మార్పు జైనమతాన్ని పక్కన పెట్టింది.
2. వైష్ణవం మరియు శైవ భక్తి ఉద్యమాలు పెరగడం:
-
కాలక్రమేణా మత ధోరణులు మారి, వైష్ణవ మరియు శైవ భక్తి ఉద్యమాలు విస్తరించాయి. నానాఘాట్ శాసనాలలో వాసుదేవుడు మరియు శంకర్షణుడిపై భక్తిని పేర్కొనడం కనిపిస్తుంది. పాశుపత శైవమతం దక్షిణ భారతదేశమంతటా విస్తరించి, ప్రజల్ని ఆకర్షించింది. దీన్ని జైనమతం యొక్క తపస్వి ధోరణితో పోల్చితే, భక్తి ఉద్యమాలకు సామాన్య ప్రజానికం ఎక్కువ స్పందన ఇచ్చింది.
3. బౌద్ధమతానికి ఇచ్చిన ప్రాధాన్యత:
-
యజ్ఞశ్రీ శాతకర్ణి వంటి శాతవాహనులు బౌద్ధమతానికి విశేషమైన పోషణ అందించారు. ఆచార్య నాగార్జునకు రాజాశ్రయం లభించింది. తెలంగాణలో ధూలికట్ట, కోటి లింగాల, పెద్దబోంకూరు వంటి ప్రముఖ బౌద్ధ కేంద్రాలు అభివృద్ధి చెందడం జైనమతంపై తీవ్ర ప్రభావం చూపింది.
4. ఇక్ష్వాకుల మతపరమైన విధానాలు:
-
ఇక్ష్వాకులు (విజయపురి - నేటి నాగార్జునకొండ వద్ద రాజధాని) బ్రాహ్మణమతం మరియు బౌద్ధమతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అనేక బౌద్ధ స్మారకాలను నిర్మించారు. కానీ , ఈ కాలంలో జైనమతానికి సంబంధించిన ఆధారాలు కనిపించవు, ఇది జైనమతానికి అప్పట్లో ఉన్న నిరాధారణను తెలియజేస్తుంది.
5. జైన ఆచారాలు ప్రజలలో పరిమితంగా వ్యాప్తి చెందడం:
-
జైనమతంలోని సల్లేఖన వ్రతం (ప్రాణత్యాగవ్రత) వంటి కఠినమైన ఆచారాలు ఎక్కువగా తపస్వుల మఠాలకే పరిమితమయ్యాయి. మునులగుట్ట వద్ద ఉన్న శిలాశయనాలు దీని తపోమార్గాన్ని ప్రతిబింబిస్తాయి. భక్తి ఉద్యమాలకు గల ప్రజాధారంతో పోలిస్తే, జైనమతం సామాన్యులకు ఆసక్తికరంగా లేకపోవడం దీని విస్తరణను పరిమితం చేసింది.
6. విదేశీ వంశాలు హిందూ క్షత్రియమతంలో విలీనము అవ్వడం:
-
శాతవాహనులు శకులు, గ్రీకులు, పహ్లవులను హిందూ క్షత్రియ సంప్రదాయంలో విలీనం చేశారు. ఉదాహరణకు, నహపానుడి కుటుంబం హిందూ కర్మకాండలను ఆచరించడం ద్వారా బ్రాహ్మణమతాన్ని బలపరిచింది. దీని వలన జైనమతానికి ప్రజా ధారణ పొందే అవకాశాలు తగ్గిపోయాయి.
7. ఆర్థిక మరియు వాణిజ్య మార్పులు:
-
శాతవాహనుల తరువాత నగర వికాసం మరియు వాణిజ్య మార్గాలు క్షీణించాయి. జైనమతం ఎక్కువగా నగరాధారిత వ్యాపారి వర్గాలపై ఆధారపడి ఉండటం వలన, ఈ మార్పులు దాని ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీశాయి. వాణిజ్య మార్గాలు తీరప్రాంతం వైపు మళ్లడం, తెలంగాణలో పట్టణాభివృద్ధి మందగించడం వల్ల జైనమత స్థాపనలు బలహీనపడ్డాయి.

ముగింపు:
జైనమతం కాలక్రమేణా తన ప్రభావాన్ని కోల్పోయినప్పటికీ, అది తెలంగాణలో సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక జీవనంలో చిరస్థాయిగా చెరగని ముద్రను వేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలునపాక జైన ఆలయం వంటి ప్రాచీన క్షేత్రాలు, అపురూప తీర్థంకర విగ్రహాలు, తెలంగాణ యొక్క బహుళ మతసామరస్యాన్ని, సంస్కృతి సంరక్షణను, మరియు చారిత్రక పరంపరకు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.