TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES

Thu Apr 24, 2025

Q. భూస్వామ్య వ్యతిరేక మరియు వలసవాద వ్యతిరేక పోరాటాలలో వామపక్ష పార్టీల పాత్రను చర్చించండి.

పరిచయం:
1917 రష్యా విప్లవ ప్రభావంతో పాటు మార్క్సిజం వంటి విప్లవాత్మక ఆలోచనలు ప్రపంచం వ్యాప్తంగా వ్యాపించడంతో, భారతదేశంలో వామపక్ష పార్టీలు బలమైన రాజకీయ శక్తిగా అవతరించాయి. అంతేకాకుండా, ఈ వామపక్షాలు బ్రిటిష్ వలస పాలనతో పాటు స్వదేశీ సంస్థానాల ఆధిపత్యాన్ని కూడా గట్టిగా వ్యతిరేకిస్తూ, వర్గ చైతన్యం మరియు సామాజిక మార్పును లక్ష్యంగా పెట్టుకున్న ఈ వామపక్ష ఉద్యమాలు భారత స్వాతంత్య్ర పోరాటానికి విప్లవాత్మక భావజాలాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాయి.

విషయం:
A. వామపక్ష ఆలోచనల అభివృద్ధి మరియు తొలి సంఘటనలు:
1. సోషలిస్టు, మార్క్సిస్ట్ సిద్ధాంతాల ప్రభావంతో 1925లో భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) స్థాపించబడింది.
2. అనంతరం 1934లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పడి, కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా వామపక్ష భావజాలాన్ని వ్యాపింపజేయాలన్న లక్ష్యంతో పనిచేసింది.
B. బ్రిటిష్ వ్యతిరేక పోరాటాల్లో వామపక్షాల పాత్ర
1. కార్మిక ఉద్యమాలు: ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC) నేతృత్వంలో బొంబాయి (1928), జంషెడ్‌పూర్, కలకత్తా వంటి ప్రాంతాలలో సమ్మెలు, నిరసనల ద్వారా కార్మిక హక్కులు మరియు వలస పాలన వ్యతిరేక పోరాటాలు జరిగాయి. 2. రైతాంగ చైతన్యం: 1936లో ఏర్పడిన అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో నీలిమందు విప్లవం, పాబ్నా తిరుగుబాటు, దక్కన్ అల్లర్లు వంటి ఉద్యమాలు రైతాంగానికి చైతన్యాన్ని కలిగించాయి.
3. యువత మరియు విద్యార్థులు: వామపక్ష విద్యార్థి సంఘాలు యువతను చైతన్యవంతం చేసి, జాతీయ మరియు సామాజిక ఉద్యమాలకు కొత్త నాయకులను అందించాయి.
4. విప్లవాత్మక జాతీయవాదం: భగత్ సింగ్ వంటి విప్లవకారులు మార్క్సిజం మరియు దేశభక్తిని మేళవించి, HSRA వంటి సంఘాల ద్వారా సమాజవాద విప్లవాన్ని ప్రేరేపించారు.
5. సామ్రాజ్య యుద్ధాల పట్ల వ్యతిరేకత: సోవియట్ యూనియన్-జర్మనీ ఒప్పందం నేపథ్యంలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో CPI మొదట తటస్థంగా వ్యవహరించినప్పటికీ, సోవియట్ యూనియన్‌పై దాడి జరిగిన తరువాత మిత్రపక్షాలకు మద్దతు ఇవ్వడం వల్ల జాతీయవాద శక్తులతో విభేదాలు తలెత్తాయి.
C. స్థానిక సంస్థానాల వ్యతిరేక పోరాటాల్లో వామపక్షాల కృషి
1. తేభాగా ఉద్యమం (1946–47): ఇది బెంగాల్ ప్రాంతంలో జరిగిన రైతు ఉద్యమం. ఇక్కడి రైతులు దిగుబడిలో మూడో వంతు వాటా కోరుతూ, భూస్వాములకు వ్యతిరేకంగా ఈ పోరాటం చేశారు.
2. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం (1946–51): నిజాం పాలన మరియు జాగీర్దారీ వ్యవస్థకు వ్యతిరేకంగా CPI నేతృత్వంలో జరిగిన రైతుల తిరుగుబాటు భూదాన ఉద్యమానికి నాంది పలికింది.
3. పున్నప్రా-వయలార్ ఉద్యమం (1946): ట్రావన్‌కోర్ సంస్థానంలో కార్మికులు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రైతులు తిరగబడ్డారు.
4. వార్లీ తిరుగుబాట్లు: మహారాష్ట్రలో ఆదివాసీలు భూమి, న్యాయబద్ధమైన వేతనాలు, బానిసత్వ విముక్తి కోసం కమ్యూనిస్టుల మద్దతుతో పోరాటం చేశారు
D. సామాజిక సంస్కరణలు
1. వామపక్ష పార్టీలు మహిళల హక్కులు, దళితుల శ్రేయస్సు, సామూహిక అక్షరాస్యత కోసం ఎంతగానో కృషి చేశాయి. ఈ పోరాటాలు ముఖ్యంగా బెంగాల్, కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో జరిగింది.
2. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, IPTA వంటి వేదికల ఆధ్వర్యంలో నాటకాలు, సాహిత్యం, కళల ద్వారా ప్రజలలో సామాజిక చైతన్యాన్ని రేకెత్తించారు.
E. వామపక్షాలకు ఎదురైన సవాళ్లు మరియు అణచివేత (1947 వరకు)
1. బ్రిటిష్ ప్రభుత్వ అణచివేత: మీరట్ కుట్ర కేసు (1929), కాన్పూర్ కేసు (1924) వంటి ఘటనల ద్వారా ప్రముఖ వామపక్ష నేతలను అరెస్టు చేసి ఆ పార్టీలను, వారి కార్యకలాపాలను నిషేదించారు.
2. పరిమితులు మరియు నిషేధాలు: జాతీయ కమ్యూనిస్టు పార్టీ 1942 వరకు అండర్‌గ్రౌండ్‌లో పనిచేసింది. అయితే దీనికి అనుబంధంగా పనిచేసే సంస్థలు అనేక సార్లు నిషేధానికి గురయ్యాయి.
3. సైద్ధాంతిక విభేదాలు: రాజ్యాంగ పద్ధతిని నమ్మే వర్గం మరియు విప్లవ మార్గాన్ని అనుసరించే వర్గాల మధ్య అంతర్గత విభేదాలు తలెత్తాయి.
4. భారత జాతీయ కాంగ్రెస్ నుండి నిష్క్రమణ: రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో కమ్యూనిస్టు పార్టీ వైఖరిలో మార్పులు రావడంతో, క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ప్రధాన జాతీయవాద పార్టీల నుంచి వేరుపడిపోయింది.

ముగింపు
విప్లవవాదం మరియు సామాజిక న్యాయం కలగలిసిన ఉన్నత భావజాలంతో వామపక్ష పార్టీలు భారత స్వాతంత్య్ర పోరాటాన్ని నూతన మార్గంలో నడిపించాయి. భగత్ సింగ్ చెప్పినట్లు — “విప్లవం మానవ జాతి యొక్క అసలైన హక్కు” — అనే మాటతో స్ఫూర్తి పొంది వామపక్ష నాయకుల ఆలోచనలను మన భారత ప్రజాస్వామ్య మరియు సమానత్వ లక్ష్యాల్లో చేర్చారు.

Additional Embellishment: