There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Wed May 7, 2025
పరిచయం:
కుతుబ్ షాహీ వంశం (క్రీ.శ 1518–1687 ) దేశీయ దక్కని సంప్రదాయాలను పర్షియన్ శైలిలోని కేంద్రీకృత పరిపాలనతో సమన్వయం చేస్తూ, ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా పరిపాలనను అభివృద్ధి చేసింది. దస్తూర్-ఇ-అమల్ వంటి రచనల ద్వారా తెలుస్తున్నట్లు, గోల్కొండ యొక్క భౌగోళిక ప్రాధాన్యాన్ని, సంపదను సమర్థవంతంగా వినియోగించి, హైదరాబాద్‌ను వాణిజ్య, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దారు.
విషయం:
I. కుతుబ్ షాహీల ఆర్థిక విధానాలు
1. విదేశీ వాణిజ్యానికి ప్రోత్సాహం:
-మచిలీపట్నం వంటి పోర్టుల ద్వారా పోర్చుగీస్, డచ్, ఇంగ్లిషు వ్యాపారులకు అనుమతులు, వాణిజ్య హక్కులు కల్పించి విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించారు.
2. వజ్రాల వాణిజ్యంపై ప్రభుత్వ నియంత్రణ:
-బొగ్గు మరియు వజ్రాల గనులపై ప్రభుత్వాధిపత్యాన్ని పెంచి భారీగా ఆదాయాన్ని పొందారు. కోహినూరు, హోప్ వజ్రం వంటి ప్రఖ్యాత వజ్రాలు గోల్కొండ గనుల నుండి వచ్చినవే.
3. భూమి శిస్తు విధానం:
-రైతులకు భారంగా లేని భూమి శిస్తు విధానాలు వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు దోహదపడ్డాయి.
4. మార్కెట్ లలో మౌలిక వసతుల అభివృద్ధి:
-హైదరాబాద్, గోల్కొండ నగరాలలో బజార్లు, కర్బాన్సరాయ్లు ఏర్పాటు చేసి వాణిజ్యాన్ని అభివృద్ధి చేశారు.
5. తూనికలు మరియు కొలతల విభాగం:
-మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో "రిసాలా మిక్దారియా" (తూనికలు, కొలతల శాఖ)ను ప్రారంభించి ప్రామాణిక యూనిట్లను ప్రవేశపెట్టారు.
ఆర్థిక విధానాల ప్రభావాలు అనుకూల ఫలితాలు:
1. గోల్కొండ వజ్రాల వ్యపారంలో అంతర్జాతీయ ప్రాముఖ్యత పొందింది.
2. హైదరాబాద్, మచిలీపట్నం వంటి నగరాలు వాణిజ్య కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.
3. విదేశీ వ్యాపారులు, నైపుణ్యం గల శిల్పుల రాకతో స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది.
ప్రతికూల ఫలితాలు:
1. వజ్రాలపై అధిక ఆధారపడటంతో ఆర్థిక వ్యవస్థ మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యేది.
2. పరిశ్రమల వైవిధ్యం లేకపోవడం వల్ల ఆర్థిక విస్తరణ అంతగా జరగలేదు.
II. కుతుబ్ షాహీల పరిపాలనా విధానాలు
1. ప్రణాళికాబద్ధమైన నగర నిర్మాణం:
-మహమ్మద్ కులీ కుతుబ్ షా క్రీ.శ1591లో హైదరాబాద్‌ను చార్మినార్ చుట్టూ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేశాడు. వెడల్పైన రహదారులు, బాగ్-ఇ-హయాత్ బక్ష్ వంటి తోటలు, ప్రజలకు వినోద స్థలాలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ పర్షియన్ నగర నిర్మాణ స్ఫూర్తిని ప్రతిబింబించేవిగా ఉన్నాయి.
2. నీటి వనరుల నిర్వహణ:
-హుస్సేన్ సాగర్ వంటి చెరువులు నగర అవసరాల కోసం నిర్మించబడ్డాయి.
3. పరిపాలనా విధానం:
-పర్షియన్లు, అఫ్గాన్లు, దేశీయులైన హిందూ ముస్లిం అధికారులను పరిపాలనలో భాగం చేయడం ద్వారా సాంస్కృతిక సమైక్యతను సాధించారు.
4. కళలు మరియు నిర్మాణానికి పోషణ:
-పర్షియన్ సంస్కృతి, తెలుగు భాష, స్థానిక కళా రూపాలను ప్రోత్సహించారు. నిర్మాణాలలో పర్షియన్-దక్కని శైలి కలగలిసిన కొత్త ఆకృతులను సృష్టించారు.
పరిపాలనా విధానాల ప్రభావాలు
అనుకూల ఫలితాలు:
1. హైదరాబాద్ ఒక బహుళ సాంస్కృతిక నగరంగా వాణిజ్య, సాంస్కృతిక జీవనానికి కేంద్రంగా రూపుదిద్దుకుంది.
2. మౌలిక వసతుల అభివృద్ధితో శాశ్వత నగరీకరణ సాధ్యమైంది.
3. పరిపాలనా విభిన్నత వల్ల స్థిరత్వం ఏర్పడి, నైపుణ్యమున్న వలసదారులను ఆకర్షించింది.
ప్రతికూల ఫలితాలు:
1. పరిపాలన ఎక్కువగా నగరాలకే పరిమితమై, గ్రామీణ అభివృద్ధికి తక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
2. వివిధ సామూహిక వర్గాలలో అంతర్గత విభేదాల వల్ల సమర్థవంతమైన పరిపాలన లోపించింది.
3. చివరి దశలో ముఘల్ దండయాత్రలు, రాజకీయ అస్థిరత వంటివి పరిపాలన వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశాయి.
ముగింపు:
ఆచరణాత్మక ఆర్థిక విధానాలు, లౌకిక పరిపాలన ద్వారా కుతుబ్ షాహీలు దక్కన్ లో అభివృద్ధి, సాంఘిక సమైక్యతను సాధించారు. గంగా-జమునా తహజీబ్ అనే సాంస్కృతిక సమన్వయాన్ని ప్రతిబింబిస్తూ, బహమనీ సామ్రాజ్యకాలంలో తలెత్తిన "ముల్కీ సమస్య"ను సమర్థంగా పరిష్కరించారు. వీరి సమర్థవంతమైన పరిపాలన ద్వారా దక్కన్లో సుస్థిరమైన పాలన మరియు నగరీకరణకు పునాది వేసిన వారిగా చరిత్రలో నిలిచారు.