TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES

Tue May 6, 2025

Q. ఢిల్లీ సుల్తానులు మరియు బహమనీల పాలనా కాలం లో స్థానిక స్వయంప్రతిపత్తినీ మరియు సంస్కృతిని సంరక్షించడంలో వెలమ రాజ్యాల పాత్రను విశ్లేషించండి.

పరిచయం:
క్రీ.శ 1323 లో కాకతీయ రాజ్య పతనమైన తర్వాత తెలంగాణలో ప్రాచీన కోటలైన రాచకొండ, దేవరకొండ కేంద్రంగా వెలమ రాజ్యాలు ఆవిర్భవించాయి. వీరు ప్రజలలో ‘దొరలు’గా ప్రసిద్ధి చెందారు. ఢిల్లీ సుల్తానుల మరియు బహ్మనీ సామ్రాజ్యాల ఆకాంక్షలకు వ్యతిరేకంగా స్థానిక స్వాయత్తతను, భాషా, సాంస్కృతిక విలువలను పరిరక్షించడంలో వీరి పాత్ర ఎంతో కీలకమైనదిగా చెప్పుకోవచ్చు.

విషయం:
I.
రాజకీయ స్వావలంబనకు వెలమల కృషి
1. కాకతీయుల పతనం తరువాత వెలముల ఆవిర్భావం:
a. ప్రతాపరుద్రుడి పరాజయం అనంతరం (క్రీ.శ1323 ), సింగమ నాయకుడు వంటి వెలమ నాయకులు రాజకీయంగా పట్టును ఏర్పరచుకొని, ఢిల్లీ సుల్తానుల పాలనకు తీవ్ర ప్రతిఘటన తెలిపారు.
b. ప్రముఖ చరిత్రకారిణి సిన్థియా టాల్బట్ ఈ దశను "ప్రాంతీయ యోధవర్గాల ప్రతిఘటన"గా పేర్కొంటారు.
2. కోటల నిర్మాణంఅధికార ప్రాతినిధ్యం:
a. అనపోత నాయకుడు రాచకొండ కోటను రాజకీయ, సైనిక కేంద్రంగా అభివృద్ధి చేశాడు.
b. మాధవ నాయకుడు దేవరకొండ కోట నుండి పాలన సాగించాడు.
c. ఈ కోటలు స్వతంత్ర అధికారానికి చిహ్నాలుగా నిలిచాయి.
3. స్థానిక పరిపాలనా సంప్రదాయాల కొనసాగింపు:
a. కాకతీయుల నాయంకర వ్యవస్థ కొనసాగించబడింది.
b. గ్రామ స్వరాజ్యాన్ని (గ్రామస్వాయత్తత) కొనసాగించారు.
c. ప్రముఖ చరిత్రకారుడు పి.వి.పి. శాస్త్రి దీన్ని కాకతీయ పరిపాలన యొక్క కొనసాగింపుగా విశ్లేషించాడు.
4. బహమనీ దాడులకు వ్యూహాత్మక ప్రతిస్పందన:
a. కొండలపై నిర్మించిన కోటలు, రాళ్ల గోడలు, సహజ రక్షణ వ్యవస్థలు సైనిక వ్యూహంలో భాగంగా పనిచేశాయి.
b. గెరిల్లా యుద్ధాల ద్వారా బలమైన సామ్రాజ్య దళాలకు ఎదురు నిలిచారు.
5. వ్యూహాత్మక మైత్రి:
a. అవసరమైనపుడు విజయనగర లేదా గజపతులతో రాజకీయ కూటములు ఏర్పాటు చేశారు.
b. బహమనీలకు రాజకీయ అవసరాల మేరకు మాత్రమే జిజియా లేదా ఖిరాజ్ చెల్లించారు.
c. చరిత్రకారుడు రిచర్డ్ ఈటన్ దీనిని “వాస్తవిక స్థానిక కూటమి వ్యూహం”గా అభివర్ణించాడు.
II. సాంస్కృతిక పరిరక్షణలో వెలమల పాత్ర
1. తెలుగు భాషకు ప్రోత్సాహం:
a. శ్రీనాథుడు వంటి కవులను తమ రాజదర్భారులో ఉంచి ఆదరించారు.
b. స్థానిక పురాణాలు, కథనాల ఆధారమైన రచనలకు ప్రోత్సాహం ఇచ్చారు.
c. ప్రముఖ చరిత్రకారిణి సిన్థియా టాల్బట్ వెలములను “తెలుగు సంస్కృతికి ఆధారస్తంభాలు”గా పేర్కొంటారు.
2. ఆలయ అభివృద్ధికి దానాలు చేయడం:
a. రాచకొండలో శ్రీ రామలింగేశ్వర ఆలయాన్ని పునఃనిర్మించారు.
b. శ్రీశైలం, యాదగిరిగుట్ట వంటి ఆలయాలకు విరాళాలు అందించి... శైవ, వైష్ణవ సంప్రదాయాల పరిరక్షణకు తోడ్పడ్డారు.
3. స్థానిక శిల్పకళకు ప్రాధాన్యం:
a. రాచకొండ, దేవరకొండ కోటలు స్థానిక శిల్పశైలిలో నిర్మించబడ్డాయి. b. బహమనీ కోటల్లో కనిపించే పర్షియన్ శైలిని వీరు దూరంగా ఉంచారు.
4. గ్రామీణ పండుగలకు ప్రోత్సాహం:
a. బోనాలు, బతుకమ్మ వంటి ప్రజల జీవనాన్ని ప్రతిబింబించే పండుగలకు మద్దతిచ్చారు.
b. వ్యవసాయ పద్దతులతో కూడిన గ్రామాధారిత సంప్రదాయాలను నిలబెట్టారు.
5. స్థానిక వృత్తులు, శిల్పాలకు సంరక్షణ:
a. వాణిజ్యగిల్డులు (శ్రేణులు)ను ఆదరించారు.
b. నూలుపోత, కంచు విగ్రహాల తయారీ, ఇతర వృత్తుల అభివృద్ధికి తోడ్పాటును అందించారు.
III. పరిమితులు మరియు సవాళ్లు
1. బహమనీల దాడులు:
a. ఫిరోజ్ షా బహమని పలు సార్లు తెలంగాణలో దాడులు జరిపాడు.
b. ఈ దాడుల్లో రాచకొండ వంటి కీలక కోటలు వెలమల చేతిలో నుండి జారిపోయాయి.
2. వంశ విభేదాలు:
-
రాచకొండ – దేవరకొండ వెలమల మధ్య అధికారం కోసం జరిగిన అంతర్గత పోరాటాలు సామూహిక బలహీనతకు దారితీశాయి. 3. రాజకీయ పరిస్థితుల మార్పు:
-
శ్రీకృష్ణదేవరాయల పాలనలో విజయనగర సామ్రాజ్యం అభివృద్ధి చెందుతున్న కొద్దీ వెలముల ప్రాధాన్యం తగ్గింది.
4. కోట రాజధానుల పతనం:
-
15వ శతాబ్దం నాటికి రాచకొండ కోట బహమనీల ఆధీనంలోకి వెళ్లింది.
5. మహాసామ్రాజ్యాలలో విలీనం:
-
తరువాత కాలంలో వెలమలు విజయనగర, కుతుబ్ షాహీ పరిపాలనా వ్యవస్థలో అమరనాయకులుగా విలీనం అయ్యారు.

ముగింపు
మధ్యయుగ దక్కణ్ చరిత్రలో వెలమలు కేంద్ర పాలనకు వ్యతిరేకంగా స్వతంత్ర స్థానికతకు చిహ్నంగా నిలిచారు. ఆధునిక భారతదేశంలో, వారి వారసత్వం భాషా గర్వం, ప్రాంతీయ సంస్కృతి, స్థానిక పరిపాలనల పరిరక్షణ వంటి అనేక విలువలకు ప్రతీకగా నిలుస్తోంది. వీరి పాలన భారతదేశం యొక్క "భిన్నత్వంలో ఏకత్వం" అనే నానుడికి ఉదాహరణగా నిలుస్తుంది.

Embellishment: