TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES

Sun Apr 20, 2025

Q: బ్రిటిష్ పాలనా కాలంలో హస్తకళ పరిశ్రమల క్షీణత భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా కృంగదీసిందో వివరించండి.

పరిచయం:
భారతదేశం ఒకప్పుడు ప్రపంచ వస్త్ర ఎగుమతుల్లో 25% కంటే ఎక్కువ వాటా కలిగి ఉండేది, కానీ 19వ శతాబ్దం చివరి నాటికి ఇది 2% కంటే తక్కువకు పడిపోయింది. ఆంగ్లేయుల పాలనా కాలంలో చేనేత పరిశ్రమలు కుప్పకూలడంతో గ్రామీణ ప్రజల జీవనోపాధీ మరియు వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిన్నాయి.

విషయం:
చేనేత పరిశ్రమ క్షీణత – కారణాలు
1. దిగుమతులు మరియు పరిశ్రమల క్షీణత: 
-1813 తర్వాత, సుంకం లేని బ్రిటిష్ వస్త్రాలు భారత మార్కెట్లకు పోటెత్తాయి. దానితో స్థానిక చేనేత కార్మికులు తమ జీవనాధారాన్ని కోల్పోయి తీవ్రంగా నష్టపోయారు.
2. స్థానిక పాలకుల పతనం: 
-మొగల్ మరియు సంస్థాన రాజవంశాల పతనం వల్ల పట్టు, లోహ పరిశ్రమలకు ఎప్పుడూ లభించే మద్దతు లేకుండా పోయింది. దీంతో ఈ పరిశ్రమలు క్షీణించాయి.
3. ప్రతికూల శిస్తు విధానాలు: 
-అధిక భూశిస్తులు మరియు రుణ సౌకర్యం లేకపోవడం కారణంగా చేనేత కళాకారులు వ్యవసాయ కూలీలుగా మారారు. ఇది సాంప్రదాయ పరిశ్రమలను పూర్తిగా దెబ్బతీసింది.
4. రైల్వేల ద్వారా మార్కెట్ ఆధిపత్యం: 
-రైల్వేల ద్వారా చౌకైన బ్రిటిష్ వస్తువులు భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేరగలిగాయి. దానితో స్థానిక ఉత్పత్తులు తమ ప్రాధాన్యత కోల్పోయి, చేనేత రంగాన్ని సర్వనాశనం చేశాయి.
5. స్థానిక వస్తువులకు డిమాండ్ తగ్గుట: 
-బ్రిటిష్ తయారీ వస్తువుల ఆధిక్యత వల్ల స్థానిక వస్తువులకు డిమాండ్ గణనీయంగా తగ్గిపోయింది. దీంతో సాంప్రదాయ పరిశ్రమలు నిర్వీర్యంగా మారాయి.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
1. వ్యవసాయరంగంపై తీవ్ర ఒత్తిడి: 
-పనిలేకుండా ఉన్న చేనేత కళాకారులు వ్యవసాయం వైపు మళ్లారు. దీంతో భూమి విభజన పెరిగి, గ్రామీణప్రాంతాల్లో ప్రజలు జీవనాధారం లేక దుర్భర పరిస్థితులలోకి నెట్టబడ్డారు.
2. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గుదల: 
-ఒకప్పుడు వస్తువులు కొనే స్థోమత కలిగి ఉండే చేనేత కుటుంబాలు కేవలం తమ పొట్టకూటి కోసం వ్యవసాయంపై ఆధారపడసాగారు. దానితో డిమాండ్ తగ్గి గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ కుంచించుకుపోయింది.
3. జజమాని వ్యవస్థ కుప్పకూలడం: 
-సాంప్రదాయ కుల-వృత్తి ఆధారిత జజమాని వ్యవస్థ క్షీణించింది. దీంతో గ్రామాల్లో స్వయం సమృద్ధి మరియు స్థానిక ఆర్థిక నెట్‌వర్క్‌లు బలహీనపడ్డాయి.
4. రుణ భారం: 
-చాలా మంది చేనేత కళాకారులు రుణ చక్రంలో చిక్కుకున్నారు. ముఖ్యంగా కరువు సమయాల్లో వారి పరిస్థితి మరింత దిగజారింది.
5. రాజ పోషణ పొందలేకపోవడం: · మొగల్ మరియు సంస్థాన రాజవంశాల సహకారం లేకపోవడంతో, పట్టు మరియు లోహ పరిశ్రమల వంటి చేనేత రంగాలు ఆర్థిక మద్దతును కోల్పోయాయి. ఇది గ్రామీణ భారతదేశంలో ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది.

ముగింపు
ప్రముఖ చరిత్రకారుడు తపన్ రాయ్‌చౌధురి ప్రకారం, "వలస పాలన భారతదేశాన్ని పారిశ్రామికీకరణకు ఎంతగానో దూరం చేసింది.” చేనేత పరిశ్రమల క్షీణత కారణంగా భారతీయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిన్నభిన్నమైంది. ఎంతో నైపుణ్యం గల చేనేత కళాకారులు భూమిలేని కూలీలుగా మారడంతో భారత దేశం వ్యవసాయ సంక్షోభంలో చిక్కుకోవడం అనివార్యమైంది.

Additional Embellishment: