There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Mon May 5, 2025
పరిచయం:
శాతవాహనుల అనంతరం తెలంగాణలోని నాగార్జునకొండ కేంద్రంగా ఇక్ష్వాకులు (క్రీ.శ. 3వ – 4వ శతాబ్దం) పాలించారు. భూమి శిస్తు ఆధారిత పరిపాలనను వీరు కొనసాగించారు. నాగార్జునకొండ, రెంటాల, దాచేపల్లి శాసనాలు భూమి దానాలు, వాణిజ్య వృత్తుల నియంత్రణ (నేగిమలు), మత పరిరక్షణల ద్వారా వారి పరిపాలనా కొనసాగిందని తెలియజేస్తున్నాయి. ఇది ఆర్థిక మరియు సామాజిక వ్యవస్థలపై స్థానిక ఆధిపత్యాన్ని ప్రతిబింబిస్తుంది.
విషయం:
ఇక్ష్వాకుల పరిపాలనా నిర్మాణం మరియు పాలన విధానం:
1. కేంద్రీకృతమైన రాజ్య పాలన:
-ఇక్ష్వాకులు రాజును అత్యున్నత అధికారం కలిగిన పరిపూర్ణ చక్రవర్తిగా భావించారు. వసిష్ఠిపుత్ర శాంతమూలుడు, వీరపురుషదత్తుడు వంటి రాజులు "మహారాజ" మరియు "స్వామి" అనే బిరుదులను తీసుకుని తమ సార్వభౌమత్వాన్ని చాటుకున్నారు.
2. పరిపాలనా విభాగాలు (ఆహారాలు):
-రాష్ట్రాన్ని "ఆహారాలు" అనే ప్రాంతీయ విభాగాలుగా విభజించి, పన్నుల సేకరణ మరియు పాలనను వ్యవస్థబద్ధంగా నిర్వహించారు. నాగార్జునకొండ శాసనాలు దీనికి సాక్ష్యంగా ఉన్నాయి. రాజు (మహారాజ)
↓
ఆహారాలు (ప్రాంతాలు)
↓
విషయాలు (ఉపప్రాంతాలు)
↓
గ్రామాలు
3. కార్యనిర్వాహకాధికారులు:
-ఇక్ష్వాకులు సమర్థవంతమైన సైనిక మరియు పాలనా వ్యవస్థను నిర్వహించేందుకు మరాథి (సైన్యాధికారులు), సేనాపతి (యుద్ధనాయకులు), మహతలవర (అంతఃపుర రక్షకులు), అమాత్యులు (మంత్రులు) వంటి అధికారులను నియమించారు.
4. పన్నుల వ్యవస్థ మరియు భూదానాలు:
-ప్రధాన ఆదాయ వనరుగా భూఆదాయం ఉండేది. బ్రాహ్మణులకు బ్రహ్మదేయాలు, బౌద్ధ సంఘాలకు సంఘదేయ భూదానాలు చేశారు. వీరపురుషదత్తుడు వేసిన నాగార్జునకొండ శాసనాలలో బౌద్ధవిహారాలకు అనేక భూ దానాలు చేసినట్లు పేర్కొనబడింది.
5. సైనిక వ్యవస్థ:
-రథాలు, ఏనుగులు, గుర్రాలు మరియు కాల్బలంతో కూడిన చతురంగ బలగాన్ని ఏర్పరిచారు. ఇది భద్రత మరియు చట్టాల సంరక్షణకు ఉపయోగపడింది.
6. మత విధానం:
-వైదిక మతాచారాలలోని అశ్వమేధ, అగ్నిష్టోమ యాగాలను నిర్వహించినప్పటికీ, బౌద్ధమతాన్ని విశేషంగా పోషించారు. వీరపురుషదత్తుడు స్తూపాలు, విహారాలు, చైత్యాలు నిర్మాణానికి సహకరించాడు.
7. వృత్తుల సంఘాలకు (శ్రేణులు) ప్రోత్సాహం:
-వాశిష్ఠిపుత్ర శ్రీ శాంతమూలుడు "నేగిమలు"గా పిలువబడే వృత్తిశ్రేణులను ప్రోత్సహించాడు. రెంటాల మరియు దాచేపల్లి శాసనాలలో వీటి ప్రస్తావన ఉంది. ఇది వాణిజ్యం మరియు ఆర్థిక కార్యకలాపాల అభివృద్ధికి దోహదపడింది.
శాతవాహన పాలన వ్యవస్థ కొనసాగింపు:
1. కేంద్రీకృత రాజ్య పాలన:
-"మహారాజ", "స్వామి" వంటి దైవబిరుదులతో కూడిన చక్రవర్తి కేంద్రీకృతమైన పాలన కొనసాగింది.
2. పరిపాలనా విభాగాలు:
-రాజ్యాన్ని ఆహారాలుగా విభజించడంతో పరిపాలనా సామర్థ్యం పెరిగింది.
3. కార్యనిర్వాహక వ్యవస్థ:
-మహారథి, సేనాపతి, మహతలవర, అమాత్యుల వ్యవస్థ కొనసాగించబడింది.
4. భూఆదాయ వ్యవస్థ:
-బ్రాహ్మణులకు, బౌద్ధ విహారాలకు భూదానాలు చేయడం ద్వారా మత, రాజకీయ సమన్వయాన్ని కొనసాగించారు.
5. మత సహనం:
-వైదిక మరియు బౌద్ధమతాలకు ఏక కాలంలో ఆశ్రయం కల్పించారు.
శాతవాహనుల పాలనలోని మార్పులు:
1. రాజధాని మార్పు:
-విజయపురి (నాగార్జునకొండ)ని రాజధానిగా ఏర్పాటు చేసి, మత, పరిపాలన, సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేశారు.
2. బౌద్ధమతానికి అధిక ప్రోత్సాహం:
-వీరపురుషదత్తుని కాలాన్ని "మహాయాన బౌద్ధమత చరిత్రలో సువర్ణయుగం"గా భావిస్తారు. నాగార్జునకొండను "దక్షిణ గయ"గా అభివృద్ధి చేశారు.
3. రాకుమార్తెల పాత్ర:
-శాంతశ్రీ వంటి రాకుమార్తెలు మతపరమైన కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. మహాచైత్యాల నిర్మాణం, వివాహ సంబంధాల ద్వారా రాజకీయ బంధాలు బలపరిచారు.
4. ప్రాంతీయ పాలనపై దృష్టి:
-ఇక్ష్వాకుల పరిపాలన ప్రధానంగా కృష్ణా-గుంటూరు ప్రాంతాలకు పరిమితమైంది. ఇది స్థానిక పాలనా ధోరణిని ప్రతిబింబిస్తుంది. 5. స్థానిక మత, సాంస్కృతిక వ్యవస్థలు:
-రాజకుటుంబం, వ్యాపార వర్గాలు, శ్రేణులు కలసి నాగార్జునకొండలో బౌద్ధ విద్యా కేంద్రాన్ని అభివృద్ధి చేశారు. ఇది ప్రాంతీయ మత అవసరాలకు అనుగుణంగా పాలనలో మార్పుని సూచిస్తుంది.
6. గ్రామీణ-నగర జీవన శైలిల చోటు చేసుకున్న మార్పులు:
-శాతవాహనుల పతనం తరువాత పట్టణ జీవనం తగ్గిపోయింది. గ్రామ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందింది. గ్రామాలు స్వయం సమృద్ధి కలిగి పాలనా కేంద్రాలుగా మారాయి.
ముగింపు
ఇక్ష్వాకుల పరిపాలన వ్యవస్థ అనేది, ప్రాచీన భారత రాజవంశాలు పాలనా పరంగా ఎలా స్థిరత్వాన్ని కొనసాగిస్తూ, ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసారృ అద్భుతంగా చూపిస్తుంది. జైనమత పోషణ గల పాత వ్యవస్థలను కొనసాగిస్తూ, బౌద్ధమతానికి ప్రోత్సాహం, గ్రామీణ స్వయం సమృద్ధి, స్థానిక సంస్కృతికి తోడ్పాటు వంటివి తెలంగాణ చరిత్రపై ఇక్ష్వాకుల ప్రత్యేక ముద్రను మిగిల్చాయి.