TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES

Mon May 5, 2025

Q. "తెలంగాణలోని బౌద్ధ పురావస్తు కేంద్రాలు ఆ కాలం నాటి మతపరమైన మరియు సామాజిక-సాంస్కృతిక అభివృద్ధిని అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన ఆధారాలుగా పేర్కొనవచ్చు." పై ప్రకననను సమర్ధిస్తూ ఈ కేంద్రాలు దక్కను ప్రాంతంలో వాణిజ్యం, మత పోషణ మరియు బౌద్ధమత వ్యాప్తి మధ్య సంబంధాలను ఎలా తెలియజేస్తాయో ఉదాహారణలతో విశ్లేషించండి.

పరిచయం:
దక్కన్‌లో క్రీ.పూ 3వ శతాబ్దం నుండి క్రీ.శ 3వ శతాబ్దం వరకూ ప్రాచీన తెలంగాణ బౌద్ధమతానికి ఒక ప్రధాన కేంద్రంగా ఉండేది. అంతర్గత వాణిజ్య మార్గాలలో, వివిధ ప్రాంతాల అభివృద్ధిలో కీలకంగా ఉండటం వలన ఈ ప్రాంతంలో బౌద్ధమతం అభివృద్ధి చెందింది. ధూలికట్ట, ఫణిగిరి, నేలకొండపల్లి వంటి ప్రదేశాలు బౌద్ధ మతానికి ప్రధాన కేంద్రాలుగా విలసిల్లాయి.

విషయం:
1. వాణిజ్య సంబంధాలలో బౌద్ధ క్షేత్రాల స్థానం
a. తెలంగాణను తూర్పు మరియు పశ్చిమ భారతదేశ ప్రాంతాలతో కలిపే ప్రధాన అంతర్గత వాణిజ్య మార్గాల వెంట బౌద్ధ క్షేత్రాలు ఏర్పడ్డాయి.
b. కరీంనగర్ జిల్లాలోని ధూలికట్టలో లభించిన రోమన్ నాణేలు, ముత్యాలు, మట్టికుండలు ఈ ప్రాంతంలో జరిగిన ఇండో-రోమన్ వాణిజ్యం గురించి తెలియజేస్తుంది.
c. కొండాపూర్, కోటిలింగాల వంటి ప్రాంతాలలో అంతర్గత వాణిజ్యం కొనసాగింది.
d. ఈ బౌద్ధారామాలు (విహారాలు) వ్యాపారులకు విశ్రాంత స్థలాలుగా ఉండి, బౌద్ధ సిద్ధాంతాలను ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషించాయి.
2. రాజులు, అధికారులు, వ్యాపారుల పోషణ
a. శాతవాహనుల పాలనలో (క్రీ. పూ 1వ శతాబ్దం –క్రీ.శ. 3వ శతాబ్దం) బౌద్ధ మత అభివృద్ధికి ఉన్నత వర్గాల ఆశ్రయం కీలక పాత్ర పోషించింది.
b. సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరిలో లభించిన శాసనాలలో శాతవాహన అధికారులు, ధనిక వ్యాపారులు మరియు శ్రేణుల విరాళాల గురించి ప్రస్తావనలు ఉన్నాయి.
c. మహాస్తూపాలు, విహారాలు, ఇతర ధార్మిక నిర్మాణాలకు రాజులు మరియు పట్టణ వ్యాపారులు దానాలు ఇచ్చారు.
3. సామాజిక-సాంస్కృతిక జీవనంలో బౌద్ధ విహారాల పాత్ర
a. బౌద్ధ విహారాలు విద్య, నైతికత, సామాజిక సంబంధాలకు కేంద్రాలుగా మారాయి.
b. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో విస్తృతమైన విహారాలు, మహాస్తూపం, మరియు ధార్మిక ఉపన్యాసాలకి వేదికలుండే కట్టడాలు నిర్మించారు.
c. ఈ సంస్థలు స్థానిక సమాజంలో నైతిక విలువలను, మరియు సంయుక్త సాంస్కృతిక గుర్తింపును పెంపొందించాయి.
4. వాస్తు శిల్పం మరియు శిల్ప శైలులు
a. తెలంగాణలోని బౌద్ధ కళా శైలిలో, భారతీయ బౌద్ధ కళాశైలుల ప్రభావంతో పాటు, స్థానిక ప్రత్యేకతలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి.
b. నల్గొండ జిల్లాలోని గొలిలో జాతక కథల ఆధారంగా రూపొందించిన శిల్పాలలో నైతిక సందేశాన్ని చక్కగా వ్యక్తీకరించాయి.
c. నేలకొండపల్లి స్థూప నిర్మాణంలో అమరావతి శిల్పకళ యొక్క ప్రభావం ఉన్నప్పటికీ, స్థానిక శైలి ప్రత్యేకంగా కనబడుతుంది. 5. సాంస్కృతిక సమన్వయం
a. తెలంగాణలోని బౌద్ధ క్షేత్రాలు స్థానిక మత సంప్రదాయాలు, ప్రజల ఆచారాలు, జానపద విశ్వాసాలతో అనుసంధానం అయ్యాయి.
b. ధూలికట్ట శిల్పాల్లో ప్రకృతి చిహ్నాలు, జానపద దేవతలు, ప్రజల కళారూపాలు బౌద్ధ ప్రతిమలతో కలసి ఉండడమే దీనికి నిదర్శనం.
ఈ విధమైన సాంస్కృతిక సమన్వయం అనేది బౌద్ధమతం సామాన్య ప్రజలలోకి వెళ్లడానికి దోహదపడింది.

ముగింపు:
తెలంగాణలో బౌద్ధమతపు సాంస్కృతిక వారసత్వం నేటికీ నిలిచి ఉంది. నాగార్జునసాగర్ వద్ద అభివృద్ధి చేస్తున్న ఆసియా ఖండంలోనే అతి పెద్ద బౌద్ధవనాన్ని దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ విధమైన ప్రయత్నాలే వారసత్వ పర్యాటనను ప్రోత్సహించి, చారిత్రక అవగాహనను పెంపొందిస్తాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.