There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Tue Apr 8, 2025
పరిచయం:
క్రీ. శ. 11 నుండి 17 వ శతాబ్దాల మధ్య హిందూ మతాన్ని మరియు హిందూ సమాజాన్ని సంస్కరించడానికి మొదలయిన భక్తి ఉద్యమం ఆధ్యాత్మికతను, సరళమైన జీవనవిధానాన్ని, మరియు సామాజిక సంస్కరణలను ప్రోత్సహిస్తూ, అప్పటి సమకాలీన సమాజంలో భాగంగా ఉన్న మూఢ ఆచారాలనూ, విగ్రహారాధననూ, సామాజిక అసమానతలనూ సవాలు చేసింది.
విషయం:
1. మతపరమైన ప్రభావం
- భక్తి ఉద్యమం క్లిష్టమైన ఆచార వ్యవహారాలనూ, మరియు కుల తారతమ్యాలనూ వ్యతిరేకిస్తూ ఆధ్యాత్మికతకూ, భక్తి భావానికి ప్రాధాన్యత ఇచ్చింది. రామానుజాచార్యులు, కబీర్, మీరాబాయి వంటి వారు క్రతువులు, ఆచారాలను సవాలు చేస్తూ భగవంతునితో మమేకమవగలిగే ఆధ్యాత్మిక భావాలకు ప్రాధాన్యతను ఇచ్చారు. మరీ ముఖ్యంగా భక్తి ఉద్యమం హిందూ-ముస్లిం ల మధ్య సోదర భావాన్ని, మత సహనాన్ని ప్రోత్సహించింది.
- ఉదా: కబీర్ మరియు గురు నానక్ వంటి వారు మత భేదాలకు అతీతంగా సులువైన ఆధ్యాత్మిక భక్తి భావాన్ని తమ రచనల ద్వారా సమాజానికి పరిచయం చేసారు.
2. సామాజిక ప్రభావం
- భక్తి ఉద్యమం అప్పటి సమకాలీన సమాజంలో అంతర్భాగంగానున్న కుల, లింగ మరియు వర్గ అసమానతలను వ్యతిరేకించింది. ఈ ఉద్యమం పేదలు, మహిళలు, మరియు ఇతర నిమ్న వర్గాలలో చైతన్యం తీసుకురావడంలో కీలకమైన పాత్ర పోషించింది. మీరాబాయి మరియు రవిదాస్ వంటి ఆధ్యాత్మిక గురువులు తమ రచనల ద్వారా సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు తమ తోడ్పాటును అందించారు.
3. సాంస్కృతిక మరియు భాషా ప్రభావం
- భక్తి ఉద్యమం సాంస్కృతిక అభివృద్ధికి కూడా ఎంతగానో దోహదపడింది. భక్తి ఉద్యమ గురువులు సామాన్య మరియు వాడుక భాషలలో తమ కవితలు మరియు రచనలతో ముందుకొచ్చారు.
- ఉదా: రామానుజాచార్యులు, కబీర్, మరియు చైతన్య మహాప్రభు లాంటి వారు తెలుగు, తమిళం, మరియు మరాఠీ భాషలలో విస్తృతంగా భక్తి పాటలను రచించారు. o భక్త రామదాసుగా ప్రసిద్ధి పొందిన కంచెర్ల గోపన్న తన కీర్తనల ద్వారా తెలుగులో ఆధ్యాత్మిక సంగీతాన్ని ప్రోత్సహించడంతో పాటు రామభక్తితో ఆయన రచించిన సుప్రసిద్ధ భజనలు సామాన్య ప్రజానీకంలో విశేషాదరణను పొందాయి.
4. రాజకీయ ప్రభావం
- భక్తి ఉద్యమం మత వివక్షను ప్రశ్నించడంతో పాటుగా సమకాలీన సమాజానికి భక్తి భావాన్ని పరిచయం చేయడంలో కొత్త ఒరవడిని తీసుకువచ్చింది. ఆ కాలంనాటి రాజకీయ పరిస్థితులను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తూ తద్వారా మత కుల వర్గ విభేదాలను నిర్వీర్యం చేసింది.
5. నైతిక జీవనశైలి పై ప్రభావం
- ఈ ఉద్యమం సామాన్య ప్రజానీకానికి నిజాయితీ, విధేయత మరియు అహింస వంటి నైతిక జీవన విలువలను పరిచయం చేయడంతో పాటుగా తరువాత కాలంలో సమాజంలో భాగమైన సిక్కు మతంలాంటి నూతన మతాలకు, వాటి సిద్ధాంతాలకు ప్రేరణగా నిలిచింది. అంతేకాకుండా మహాత్మా గాంధీ లాంటి నాయకులు బ్రిటిషు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాగించిన పోరాటంలో అహింసా, సమానత్వం వంటి విలువలు భాగం అవ్వడంలో కూడా ఎంతో ప్రభావం చూపించింది.
ముగింపు:
భక్తి ఉద్యమం మధ్యయుగ భారతదేశంలో సానుకూలమైన మతపరమైన, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, మరియు నైతిక మార్పులను తీసుకురావడంతో పాటుగా ప్రజలకు శాంతినీ, సరళత్వాన్ని పరిచయం చేసింది.