TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES

Sun Apr 20, 2025

Q. “ఆధున్నక్ ప్రపంచ చరిత్రలో జరిగిన రాజకీయ, ఆరిిక్ మరియు సామాజిక్ అభివృద్ధులు భ ారతదేశంలోన్న బ్రిటీషు వయతిరేక్ పోరాటాన్నకి ప్రేరణగా న్నలిచాయి” వాయఖ్యయన్నంచండి.

పరిచయం:
భారతదేశంలో బ్రిటిషు వ్యతిరేక పోరాటం, ఐరోపా పునరుజ్జీవన యుగపు స్వేచ్ఛ మరియు సమానత్వ విలువలు, అంతేకాకుండా అమెరికన్ మరియు ఫ్రెంచ్ విప్లవాలచే ఎంతగానో ప్రేరేపించబడింది. స్థానికంగా కూడా, భారతీయులు ఎదుర్కొంటున్న ఆర్థిక దోపిడీ మరియు పాశ్చాత్య సిద్ధాంతాలైన స్వయం-పాలన మొదలగు భావనలచే ఎంతో స్ఫూర్తి పొందిన విద్యావంతులైన భారతీయ మధ్యతరగతి ప్రజలు స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించారు.

విషయం:
రాజకీయ పరిణామాలు
1. ఫ్రెంచ్ విప్లవం (1789): 
-ఫ్రెంచ్ విప్లవం సమానత్వం, సోదరభావం మరియు స్వాతంత్య్ర భావనలను పరిచయం చేసింది. ఈ ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తూ, భారతదేశం వంటి వలస దేశాలలో రాజకీయ హక్కులు, ప్రజాస్వామ్యం మరియు నిరంకుశ పాలన ముగింపు కోసం ప్రతిఘటించేందుకు ఎంతగానో ప్రేరణనిచ్చాయి.
2. అమెరికన్ విప్లవం (1776): 
-స్వాతంత్య్రం, సమానత్వం మరియు స్వేచ్చా సూత్రాలచే ప్రేరేపితమైన అమెరికన్ విప్లవం, ఒక వలస దేశం సామ్రాజ్యవాద పాలనను కూల్చివేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని స్థాపించగలదని రుజువు చేసింది. అంతేకాకుండా భారతీయ నాయకులు స్వయం-పాలన వైపు దృష్టి సారించేలా ప్రేరేపించింది.
3. రష్యన్ విప్లవం (1917): 
-బోల్షెవిక్ విప్లవం కార్మికవర్గ ప్రతిఘటన ద్వారా సామ్రాజ్యవాద పాలనను కూల్చివేయడం సాధ్యమని చూపించింది. ఇది భారతదేశంలో సోషలిస్ట్ ఉద్యమాలకు ప్రేరణగా నిలిచింది.
4. యూరోప్‌లో జాతీయవాద ఆలోచనలు: 
-ఇటలీ (1861) మరియు జర్మనీ (1871) ఏకీకరణ జాతీయవాద శక్తికి తార్కాణంగా నిలిచింది. విచ్ఛిన్నమైన దేశాలను ఏకం చేసే ఈ ఉదాహరణలు భారత నాయకులను ఏకీకృత, స్వతంత్ర భారతదేశం కోసం పోరాడేలా ప్రభావితం చేశాయి.
5. తొలి ప్రపంచ యుద్ధం (1914–1918): 
-తొలి ప్రపంచ యుద్ధంలో బ్రిటిషు వారికి భారతీయుల అవసరం ఎంతగానో ఏర్పడడం మరియు దానికి బదులుగా భారతీయులకు స్వయం-పాలన అందిస్తామని బ్రిటిషు వారు వాగ్దానం చేయడం భారతీయులను రాజకీయ రాయితీలు డిమాండ్ చేయడానికి వెసులుబాటును అందించాయి. ఇవి తరువాత సంపూర్ణ స్వాతంత్య్ర డిమాండ్‌గా మారడంలో కీలక పాత్ర పోషించాయి.

ఆర్థిక పరిణామాలు
1. పారిశ్రామిక విప్లవం (18వ–19వ శతాబ్దం): 
-యూరోప్‌లో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం ముడి సరుకులకు పెద్ద మొత్తంలో డిమాండ్‌ను సృష్టించింది, దీనితో బ్రిటిష్ పరిశ్రమలకు మేలు చేకూరేలా భారత దేశ సంపద తరలింపు కొనసాగింది. ఈ ఆర్ధిక దోపిడీ భారతదేశ ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తూ, ఆర్ధిక స్వావలంబనకై భారతీయుల ఆకాంక్షను రేకెత్తించింది.
2. ఆర్థిక జాతీయవాదం మరియు స్వదేశీ ఉద్యమం: 
-గాంధీజీ ఆర్థిక జాతీయవాదాన్ని ప్రతిపాదిస్తూ, స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించారు. స్వదేశీ ఉద్యమం (1905) బ్రిటిష్ వస్తువుల బహిష్కరణను ప్రోత్సహించి, వలస ఆర్థిక విధానాలను సవాలు చేయడానికి ఆర్థిక స్వావలంబనపై దృష్టి పెట్టాలని భారతీయులను కోరింది.
3. మహా మాంద్యం (1929–1939): 
-ప్రపంచ ఆర్థిక సంక్షోభం భారతదేశ ఆర్థిక పరిస్థితులను మరింత దిగజార్చింది. వ్యవసాయ ధరల పతనం, నిరుద్యోగం పెరగడం మరియు ఆర్థిక స్తబ్దత బ్రిటిష్ వలస ఆర్థిక విధానాలపై అసంతృప్తిని మరింత తీవ్రతరం చేసాయి.
4. ప్రథమ ప్రపంచ యుద్ధం తర్వాత నెలకొన్న ఆర్ధిక సంక్షోభం: 
-ప్రథమ ప్రపంచ యుద్ధం యొక్క ఆర్థిక ప్రభావం మరియు స్వయం-పాలన వాగ్దానాలను బ్రిటన్ నెరవేర్చకపోవడం భారత స్వాతంత్ర కాంక్షను మరింత ప్రేరేపించాయి.
5. సంపద తరలింపు: 
-దాదాభాయ్ నౌరోజీ "సంపద తరలింపు సిద్ధాంతం" బ్రిటిష్ ఆర్ధిక విధానాలు మరియు ఆర్ధిక దోపిడీని తేటతెల్లం చేసింది.
సామాజిక పరిణామాలు
1. సాంస్కృతిక పునరుజ్జీవనం: 
-19వ శతాబ్దంలో భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనం, రాజా రామ్ మోహన్ రాయ్ మరియు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వంటి సంస్కర్తల కృషిచే, భారతీయ సంస్కృతి మరియు విద్యా విధానాలలో సంస్కరణలు వచ్చాయి. భారత సాంఘిక సంస్కర్తలు సతీసహగమనం మరియు బాల్య వివాహాల వంటి సామాజిక ఆచారాలను సవాలు చేస్తూ, విద్య మరియు సామాజిక సంస్కరణలను ప్రోత్సహించడమే గాక, జాతీయ ఐక్యతకు బాట వేశారు.
2. సామాజిక సంస్కరణోద్యమాలు: 
-స్వామి వివేకానంద మరియు రాజా రామ్ మోహన్ రాయ్ వంటి వారు సాంప్రదాయ సామాజిక అసమానతలను సవాలు చేసి, సామాజిక సమానత్వం, విద్య మరియు మహిళా సాధికారతను ప్రోత్సహించారు. వీరి సంస్కరణోద్యమాలు జాతీయవాద పునాదులను పటిష్టం చేసాయి. అంతేకాకుండా భారతీయ సమాజంలో ఐక్యతా భావాన్ని పెంపొందించాయి.
3. భారతీయ జాతీయవాదం మరియు భారత జాతీయ కాంగ్రెస్: 
-1885లో స్థాపితమైన భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) జాతీయవాద భావనలను వ్యక్తపరిచే ముఖ్యమైన వేదికగా మారింది. మొదట సంస్కరణల కోసం వాదించినప్పటికీ, లాలా లజపత్ రాయ్ మరియు బాల గంగాధర తిలక్ వంటి నాయకుల నేతృత్వంలోని అతివాద దశ పూర్ణ స్వరాజ్ ను డిమాండ్ చేసింది.
4. పాశ్చాత్య విద్య యొక్క ప్రభావం: 
-భారతదేశంలో పాశ్చాత్య విద్యా వ్యాప్తి ప్రజా హక్కులు మరియు స్వాతంత్య్రం వంటి ప్రజాస్వామ్య ఆదర్శాలకు భారతీయులను చేరువ చేసింది. తద్వారా జవహర్‌లాల్ నెహ్రూ మరియు సుభాష్ చంద్ర బోస్ వంటి మేధావి వర్గం స్వాతంత్య్ర పోరాటంలో భాగమవడంలో కీలక పాత్ర పోషించింది.
5. భారతీయ మధ్యతరగతి వర్గం: 
-విద్యావంతులైన మధ్యతరగతి ప్రజలు రాజకీయ ప్రాతినిధ్యం మరియు మెరుగైన ఆర్థిక అవకాశాల కోసం డిమాండ్ చేయడం ప్రారంభించారు. సామూహిక ఉద్యమాలు మరియు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తూ భారత జాతీయోద్యమాన్ని ముందుండి నడిపించారు.

ముగింపు
భారతదేశంలో బ్రిటిషు వ్యతిరేక పోరాటం, ప్రపంచవ్యాప్త రాజకీయ విప్లవాలు, బ్రిటిష్ పాలనలో ఆర్థిక దోపిడీ మరియు భారతీయ ప్రజీనీకాన్ని ఏకం చేసిన సామాజిక సంస్కరణల ద్వారా గణనీయంగా ప్రభావితమైంది. ఈ పరిణామాలు స్వాతంత్య్ర సాధనకై ఓ సమిష్టి పోరాటానికి పునాది వేస్తూ, చివరికి 20వ శతాబ్దంలో భారత జాతీయోద్యమంగా మారి విదేశీ పాలనను తుదముట్టించాయి.

Additional Embellishment: