TGPSC GROUP-I MAINS 

ANSWER WRITING
SERIES

Fri Apr 4, 2025

Q." మౌర్యుల తదనంతర యుగం నాటి ప్రముఖ శిల్పశైలుల ముఖ్య లక్షణాల గురించి పేర్కొనండి?"

పరిచయం:
 మౌర్యుల తరువాత భారతదేశంలో బౌద్ధ ధర్మం వ్యాప్తితో పాటు శిల్పకళలోనూ విస్తృతమైన అభివృద్ధి చోటు చేసుకుంది. ఇండో-గ్రీకులు, కుషాణులు మరియు శాతావాహానులు లాంటి రాజవంశాల ఆదరణ వలన గాంధార, మధుర మరియు అమరావతి వంటి ప్రాంతీయ శిల్ప కళలు అభివృద్ధి చెందాయి. ఈ శిల్పశైలులు భారతీయ శిల్పకళలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాయి.

విషయం:
1. గాంధార శిల్ప కళ
ఎ. విదేశీ ప్రభావం: ఈ శిల్పశైలి గ్రికో-రోమన్ ప్రభావంతో ఏర్పడింది. గ్రీకు శిల్పకళ మాదిరిగా మానవ రూపంలో బుద్ధుని చూపబడింది. వాస్తవికతతో కూడిన సహజమైన చిత్రాలు, వివరణాత్మక వస్త్రాలు, రింగులు తిరిగిన జుట్టు మరియు బలమైన కండరాలు మొదలైనవి ముఖ్య లక్షణాలు.
బి. ఉపయోగించిన రాయి: మెత్తగా ఉండే గ్రే షిస్టు రాయి (Grey Schist). ఈ రాయి క్లిష్టమైన శిల్పాలను చెక్కడానికి అనువైనది.
 సి. బుద్ధుని వర్ణన: తొలి మానవ-రూప బుద్ధుని ప్రతిమలలో యవ్వనం, ధ్యానం, రోమను వస్త్రధారణ వంటివి కనిపిస్తాయి. అలాగే బుద్ధుని ముఖంలో ఆధ్యాత్మిక ప్రశాంతత కూడా కనిపించే విధంగా ఉండడం ఈ శైలి ప్రత్యేకత.
డి. ప్రభావం: ఇండో-గ్రీకుల ఆదరణ కారణంగా హెలెనిస్టిక్ కళాత్మక సంప్రదాయాల బలమైన ప్రభావం ఈ శిల్పకళపై ఉంటుంది.
ఇ. అభివృద్ధి: కుషాణుల కాలంలో ముఖ్యంగా మొదటి కనిష్కుడి పాలనలో తక్షశిల మరియు పెషావర్ ప్రధాన కేంద్రాలుగా ఈ కళ అభివృద్ధి చెందింది.

2. మధుర శిల్ప కళ

ఎ. శైలి: ఇది స్వదేశీ శిల్ప కళ. శిల్పాల్లో శక్తివంతమైన శరీర నిర్మాణం, సౌందర్యం, చిహ్నాలు గుర్తులు, మరియు స్థానిక ప్రత్యేకతలు కనిపిస్తాయి.
బి. ఉపయోగించిన రాయి: స్థానికంగా లభించే ఎర్రని ఇసుకరాయి.
సి. బుద్ధుని చిత్రణ: నవ్వుతున్న ముఖం, తల పైన ఉష్నిషా, ఉర్నా, అరచేతులు/కాళ్ళపై చక్రం; కూర్చున్న మరియు నిలబడి ఉన్న రూపాల్లో బుద్ధుడు కనిపిస్తాడు. 
 డి. ప్రభావం: బౌద్ధమత తొలికాలం నాటి యక్ష ఆరాధన మరియు జానపద సంప్రదాయాల ప్రభావం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది.
ఇ. అభివృద్ధి: కుషాణులు, తరువాత గుప్తుల కాలంలో ఈ శైలి విరివిగా అభివృద్ధి చెందింది. ఈ శిల్పకలకు మధుర ప్రధాన కేంద్రంగా ఉండేది. 

3. అమరావతి శిల్పకళ

ఎ. శైలి: సొగసైన, కదిలే మరియు గతిశీల శైలి. కథనాత్మక ఫలకాలు, హై-రిలీఫ్ శిల్పాలకు ప్రసిద్ది చెందింది.
బి. ఉపయోగించిన రాయి: సున్నితమైన తెల్లని సున్నపురాయి.
సి. బుద్ధుని వర్ణన: ప్రారంభంలో గుర్తులతో (తామర పువ్వు, బోధి చెట్టు వంటి చిహ్నాలు), తరువాత మానవ-రూపంలో ఉండే బుద్ధుని చిత్రాలను మనోహరమైన భంగిమలతో తీర్చిదిద్దారు.
డి. ప్రభావం: బుద్ధుని జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలతో మిళితమైన దేశీయ ద్రావిడ సంప్రదాయాల ప్రభావం ఈ శిల్పకళ పై ఉంది.
ఇ. అభివృద్ధి: కృష్ణ గోదావరి మైదాన ప్రాంతంలో శాతవాహనుల పోషణలో అభివృద్ధి చెందింది. అమరావతి స్థూపం ఈ శిల్పకళకి చెందిన ప్రముఖ నిర్మాణం.


ముగింపు:
 గాంధార, మథుర, అమరావతి శిల్పశైలులు భారత బౌద్ధ శిల్పకళను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించాయి. ప్రతి శైలి ప్రత్యేకమైన ప్రాంతీయ లక్షణాలను, ఆధ్యాత్మికతను జోడిస్తూ భారత ప్రాచీన కళా వైభవానికి చిరునామాగా నిలిచాయి.